వామ్మో.. షుగర్ వల్ల దేశంలో ఇన్ని లక్షల కోట్ల నష్టమా.. డాక్టర్లు ఏమంటున్నారంటే..?

మధుమేహం అంటే కేవలం రక్తంలో చక్కెర స్థాయి పెరగడం మాత్రమే కాదు.. అది దేశ ఆర్థిక వ్యవస్థను లోలోపల తినేస్తున్న నిశ్శబ్ద శత్రువు. మన దేశంలో డయాబెటిస్ ఇప్పుడు వ్యక్తిగత ఆరోగ్య సమస్య స్థాయిని దాటి ఏకంగా 11.4 ట్రిలియన్ డాలర్ల భారీ ఆర్థిక భారంగా మారింది. ఆసుపత్రి బిల్లుల కంటే అదృశ్య ఖర్చులే మనల్ని కుంగదీస్తున్నాయని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. దీనిని ఎలా నివారించాలంటే..?

వామ్మో.. షుగర్ వల్ల దేశంలో ఇన్ని లక్షల కోట్ల నష్టమా.. డాక్టర్లు ఏమంటున్నారంటే..?
Economic Burden Of Diabetes In India

Updated on: Jan 13, 2026 | 5:07 PM

మన దేశంలో మధుమేహం ఇక వ్యక్తిగత ఆరోగ్య సమస్య కాదు. ఇది దేశ ఆర్థిక పునాదులను కదిలించే పెను సంక్షోభంగా మారుతోంది. అంతర్జాతీయ పరిశోధకులు వెల్లడించిన తాజా అధ్యయనం ప్రకారం.. మధుమేహం కారణంగా అత్యధిక ఆర్థిక భారాన్ని మోస్తున్న దేశాల్లో అమెరికా తర్వాత దాదాపు 11.4 ట్రిలియన్ డాలర్ల నష్టంతో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ది లాన్సెట్ నివేదికల ప్రకారం.. భారతదేశం ప్రపంచ మధుమేహ రాజధానిగా మారుతోంది. ప్రపంచంలోని 82.8 కోట్ల మధుమేహ కేసుల్లో పావు వంతు కంటే ఎక్కువ మంది భారతీయులే ఉండడం గమనార్హం. దేశంలోని షుగర్ పేషెంట్లలో 2శాతం మందికి ఎటువంటి చికిత్స అందడం లేదు. ఇది భవిష్యత్తులో మరింత ఆర్థిక భారానికి దారితీయనుంది.

నిజమైన ఖర్చు ఆసుపత్రి బిల్లుల్లో లేదు

నేచర్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. డయాబెటిస్ వల్ల కలిగే మొత్తం ఆర్థిక భారంలో 90శాతం వాటా అనధికారిక సంరక్షణ వల్లే వస్తోంది. అంటే రోగిని చూసుకోవడానికి కుటుంబ సభ్యులు తమ ఉద్యోగాలను వదులుకోవడం లేదా పని గంటలు తగ్గించుకోవడం, ఉత్పాదకత తగ్గడం, దీర్ఘకాలిక అనారోగ్యం వల్ల కలిగే నష్టం వంటి వాటి వల్లే వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ ఖర్చు 152 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇది ప్రపంచ జీడీపీలో 1.7 శాతానికి సమానం.

సైలెంట్ కిల్లర్.. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?

మధుమేహం కేవలం రక్తంలో చక్కెర స్థాయిని పెంచడమే కాదు అది ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాలక్రమేణా ఇది.. మూత్రపిండాల వైఫల్యం, గుండెపోటు, అంధత్వం, స్ట్రోక్, అవయవ విచ్ఛేదనానికి దారితీస్తుంది. 2045 నాటికి ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య 78 కోట్లు దాటుతుందని అంచనా.

నిపుణుల ఏమంటున్నారంటే..?

మధుమేహం పెరగడానికి ప్రధాన కారణాలు, నివారణ మార్గాలపై డాక్టర్ పంకజ్ శర్మ కీలక అంశాలు వెల్లడించారు. నడుము చుట్టూ పేరుకుపోయే కొవ్వు.. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, చక్కెర పానీయాలు, శారీరక శ్రమ లేకపోవడం ఇన్సులిన్ నిరోధకతను పెంచుతున్నాయని అన్నారు. భోజనం తర్వాత విపరీతమైన అలసట, ఆకలి పెరగడం, గాయాలు నెమ్మదిగా మానడం, తరచుగా మూత్ర విసర్జన వంటివి షుగర్‌కు వార్నింగ్ సిగ్నల్స్ అని చెప్పారు. 30 ఏళ్లు పైబడిన వారు, ఊబకాయం లేదా కుటుంబ చరిత్ర ఉన్నవారు ప్రతి ఏడాది HbA1c పరీక్ష చేయించుకోవాలని సూచించారు. నేను చక్కెర తినను, కాబట్టి నాకు షుగర్ రాదు అనుకోవడం పొరపాటు. అన్నం, రోటీ, వేయించిన ఆహారాలు కూడా ప్రమాదకరమే అని స్పష్టం చేశారు.

పరిష్కారం ఏంటి?

రోజుకు 30-45 నిమిషాల వాకింగ్, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం, సరైన నిద్ర వంటి అలవాటు చేసుకోవాలి. తీవ్రమైన ఊబకాయం ఉన్నవారికి ఇది కేవలం బరువు తగ్గించే సర్జరీ మాత్రమే కాదు మధుమేహాన్ని తిప్పికొట్టే శక్తివంతమైన వైద్య మార్గం.