ఒక్క EMI కట్టకపోతే ఏం అవుతుందిలే అనుకుంటున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

EMI చెల్లింపులలో ఆలస్యం చిన్న విషయంగా కనిపించినా, ఇది భవిష్యత్తు రుణాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బ్యాంకులు రుణగ్రహీతల క్రమశిక్షణను నిశితంగా పరిశీలిస్తాయి; ఆలస్య చెల్లింపులు క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీసి, అధిక వడ్డీ రేట్లు లేదా రుణ తిరస్కరణ కు దారితీయవచ్చు.

ఒక్క EMI కట్టకపోతే ఏం అవుతుందిలే అనుకుంటున్నారా? అయితే ఇది తెలుసుకోండి!
Emi 4

Updated on: May 12, 2026 | 9:57 PM

EMI ఒకటి లేదా రెండు నెలలు ఆలస్యంగా చెల్లిస్తే పెద్ద సమస్యేమీ ఉండదని చాలా మంది భావిస్తుంటారు. తర్వాత చెల్లించేస్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ ఆ చిన్న నిర్లక్ష్యమే భవిష్యత్తులో కొత్త రుణాలు పొందే అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఇప్పుడు కేవలం ఆదాయం లేదా క్రెడిట్ స్కోర్ మాత్రమే కాకుండా, రుణగ్రహీత తిరిగి చెల్లించే క్రమశిక్షణను కూడా ఎంతో కీలకంగా పరిశీలిస్తున్నాయి. ఏదైనా EMI గడువు తేదీకి చెల్లించకపోతే, ఆ సమాచారం వెంటనే క్రెడిట్ బ్యూరో రికార్డుల్లో నమోదవుతుంది. తర్వాత కొద్ది రోజులకు చెల్లించినా, ఆలస్య చెల్లింపుగా ఆ రికార్డు అలాగే మిగిలిపోతుంది.

ఈ లోన్‌ హిస్టరీ భవిష్యత్తులో రుణం పరిశీలించే ఇతర బ్యాంకులకు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా హోమ్ లోన్, బిజినెస్ లోన్, కార్ లోన్ వంటి పెద్ద రుణాల సమయంలో ఈ వివరాలను మరింత నిశితంగా పరిశీలిస్తారు. నిపుణుల ప్రకారం ఒకసారి ఆలస్యం జరగడం కంటే, తరచుగా EMIలు ఆలస్యమవడం మరింత ప్రమాదకరం. ఇది రుణగ్రహీత ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందనే సంకేతంగా బ్యాంకులు పరిగణిస్తాయి. ఫలితంగా కొత్త రుణాలపై అధిక వడ్డీ రేట్లు, తక్కువ రుణ పరిమితి లేదా పూర్తిగా తిరస్కరణ కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో క్రెడిట్ కార్డ్ పొందడమే కష్టమవుతుంది.

రుణదాతలు ముఖ్యంగా తిరిగి చెల్లింపు హిస్టరీని విశ్వసనీయతకు ప్రమాణంగా చూస్తారు. క్రమం తప్పకుండా EMIలు చెల్లించే వ్యక్తులు మంచి క్రెడిట్ ప్రొఫైల్‌ను నిర్మించుకుంటారు. ఇది భవిష్యత్తులో తక్కువ వడ్డీతో సులభంగా రుణాలు పొందేందుకు సహాయపడుతుంది. ఇలాంటి సమస్యలను నివారించడానికి ఆటో డెబిట్ సౌకర్యాన్ని ఉపయోగించడం, గడువు తేదీలను ముందుగానే గుర్తుంచుకోవడం, అత్యవసర నిధిని సిద్ధంగా ఉంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఆలస్యం జరిగితే వీలైనంత త్వరగా చెల్లించడం ద్వారా నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. మొత్తానికి EMI చెల్లింపుల్లో క్రమశిక్షణ పాటించడం కేవలం ప్రస్తుత రుణానికే కాదు, భవిష్యత్తు ఆర్థిక అవకాశాలకూ కీలకమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us