
సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్న ఒక వీడియోపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ వీడియోలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరును ఉపయోగిస్తూ కేవలం రూ.22,000 పెట్టుబడితో వారం రోజుల్లో రూ.5.5 లక్షల వరకు లాభాలు పొందవచ్చని తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియోను PIB ఫ్యాక్ట్ చెక్ యూనిట్ పూర్తిగా నకిలీదిగా ప్రకటించింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రూపొందించిన డీప్‌ఫేక్ వీడియో అని స్పష్టం చేసింది.
వీడియోలో HDFC బ్యాంక్, SBI, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రముఖ కంపెనీల లోగోలు చూపిస్తూ, ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న పెట్టుబడి వేదికగా చూపించారు. అలాగే ఆకర్షణీయమైన గ్రాఫిక్స్, వేగంగా పెరుగుతున్న లాభాల కౌంటర్లు ద్వారా ప్రజలను మోసగించే ప్రయత్నం జరిగింది. అయితే ఆర్థిక మంత్రి గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఇలాంటి పెట్టుబడి పథకాలను ఎప్పుడూ ఆమోదించలేదని PIB స్పష్టం చేసింది. తక్కువ సమయంలో అసాధారణ లాభాలు వస్తాయని చెప్పే ఏ పథకమూ నమ్మదగినది కాదని హెచ్చరించింది.
A video circulating on social media falsely shows Union Finance Minister Nirmala Sitharaman promoting an investment platform and claiming returns of ₹5.5 lakh in one week on an initial investment of ₹22,000.#PIBFactCheck:
❌ The video is #FAKE and AI-generated
✅ The… pic.twitter.com/UM4wpe7tz0
— PIB Fact Check (@PIBFactCheck) April 9, 2026
నిపుణుల ప్రకారం ఇలాంటి వాగ్దానాలు సాధారణంగా పాంజీ స్కీమ్‌ల లక్షణాలు. మొదట చిన్న లాభాలు చూపించి నమ్మకం పొందిన తర్వాత, పెద్ద మొత్తంలో మోసం చేసే ప్రమాదం ఉంది. ఇటీవలి కాలంలో AI డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి ప్రముఖుల ముఖాలు, స్వరాలను నకిలీగా ఉపయోగించడం పెరిగిన నేపథ్యంలో, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం ఎల్లప్పుడూ అధికారిక వెబ్‌సైట్లు లేదా ప్రభుత్వ ప్రకటనల ద్వారానే ధృవీకరించుకోవాలని అధికారులు సూచించారు. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయకుండా, వ్యక్తిగత లేదా బ్యాంక్ వివరాలు పంచుకోవద్దని హెచ్చరించారు. ఇలాంటి అనుమానాస్పద వీడియోలు లేదా సందేశాలు కనిపిస్తే, వెంటనే PIB ఫ్యాక్ట్ చెక్‌కు పంపి నివేదించాలని కేంద్ర ప్రభుత్వం పౌరులను కోరుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి