
ఈ ఏడాది చివరి నెల డిసెంబర్ 2025 వచ్చేసింది. ప్రతి నెల మాదిరిగానే, డిసెంబర్ 1 నుండి మీ ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపే అనేక కీలక మార్పులు రానున్నాయి. ఈ మార్పులలో బ్యాంకు సెలవుల తేదీలు, ఇంధన ధరల సవరణ, బ్యాంక్ రుణ రేట్లపై నిర్ణయాలు, పెన్షనర్లకు సంబంధించిన కీలక మార్పులు ఉన్నాయి.
చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన వంట గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. డిసెంబర్ 1న ఈ ధరలలో మార్పు ఉండవచ్చు. సగటు అంతర్జాతీయ ఇంధన ధర, విదేశీ మారకపు రేటు ఆధారంగా ఇంటి అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్, కమర్షియల్ సిలిండర్ ధరలు మారుతాయి. ఎయిర్ టర్బైన్ ఇంధనం ధరలు కూడా మారతాయి కాబట్టి విమాన ఛార్జీలు కూడా హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 2025లో మొత్తం 18 బ్యాంకు సెలవులను ప్రకటించింది. వీటిలో ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు వంటి సాధారణ వారపు సెలవులు కూడా కలిసి ఉన్నాయి. డిసెంబర్ 1, 3, 7, 12, 13, 14, 18, 19, 20, 21, 24, 25, 26, 27, 28, 30, 31 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. బ్యాంకు సెలవులు రాష్ట్రాల వారీగా, పండుగల ఆధారంగా మారుతూ ఉంటాయి.
మీరు హోమ్ లోన్స్ లేదా ఇతర రుణాలపై ఈఎంఐ చెల్లిస్తున్నట్లయితే, డిసెంబర్ నెల మీకు ముఖ్యమైనది. ఆర్బీఐ డిసెంబర్ 3 నుంచి 5 తేదీలలో సమావేశం కానుంది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రెపో రేటు తగ్గింపుపై చర్చ జరిగే అవకాశం ఉంది. చాలా మంది విశ్లేషకులు రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి తీసుకురావొచ్చని భావిస్తున్నారు. రెపో రేటు తగ్గితే, వాణిజ్య బ్యాంకులు ఇచ్చే రుణ రేట్లు తగ్గుతాయి. ఫలితంగా మీ ఈఎంఐలు తగ్గే అవకాశం ఉంటుంది.
యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ డిసెంబర్ 2025 వీసా బులెటిన్‌ను విడుదల చేసింది. ఇది హెచ్1బీ వీసాల విషయంలో భారత్ పురోగతిపై వివరాలు అందిస్తుంది. ఈ క్యాలెండర్ ఏడాది చివరి నాటికి అమెరికాతో పరస్పర సుంకాలపై ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాన్ని ఖరారు చేయాలని భారత్ ఆశిస్తున్నట్లు వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. ఇది ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యానికి కీలకం.
నవంబర్ 30 అనేది పెన్షనర్లు, పన్ను చెల్లింపుదారులు పూర్తి చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులకు చివరి గడువు:
లైఫ్ సర్టిఫికేట్: మీ వార్షిక లైఫ్ సర్టిఫికేట్‌ను డిజిటల్‌గా లేదా భౌతికంగా మీ బ్యాంక్ లేదా పోస్టాఫీసులో సమర్పించడానికి నవంబర్ 30 చివరి తేదీ.
TDS వివరాలు: అధిక విలువ లావాదేవీలకు సంబంధించిన TDS వివరాలు దాఖలు చేయడానికి కూడా నవంబర్ 30 చివరి తేదీ. ఈ గడువును దాటితే జరిమానా విధించే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి