‘అతి’ ఎక్కడైనా కూడా మంచిది కాదు. డబ్బులు విషయంలో అస్సలు అతి ఉండకూడదు. అతిగా అనవసరమైన వాటికి కూడా డబ్బు ఖర్చు పెడితే.. మనకు మిగిలేది ఏం ఉండదు. ముఖ్యంగా క్రెడిట్ కార్డుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు క్రెడిట్ కార్డు ఉంటే ప్రయోజనం అని అంటారు.. మరికొందరు అధిక ఛార్జీలతో క్రెడిట్ కార్డు ఎందుకని.. వదిలేయమని సలహా ఇస్తారు. అసలు క్రెడిట్ కార్డు మంచిదా.? చెడ్డదా.? ఒకవేళ ఉంటే.. క్రెడిట్ కార్డును డెబిట్ కార్డులా వాడితే ఏం జరుగుతుంది.! ఇప్పుడు చూద్దాం..
క్రెడిట్ అంటే అప్పు అవసరం లేని వారికి క్రెడిట్ కార్డులు చక్కగా ఉపయోగపడతాయని మార్కెట్ ఇన్వెస్టర్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డి ముత్తుకృష్ణన్ చెబుతున్నారు. ఏమిటి? ఇది అర్ధం కాలేదా. ఈమాటలను వివరంగా అర్థం చేసుకునే ముందు, క్రెడిట్ కార్డ్ ప్రాథమికంగా ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం ముఖ్యమని ఆయన అంటున్నారు.
బ్యాంకులు లేదా NBFCలు మీకు క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చాలా తక్కువ వ్యవధిలో రుణాలను అందిస్తాయి. క్రెడిట్ కార్డ్ ఖర్చు పరిమితిని.. ఆదాయం ఆధారంగా.. బ్యాంకులు సెట్ చేస్తాయి. అంటే, మీకు ఇచ్చిన పరిమితి వరకు ఎప్పుడైనా ఎక్కడైనా క్రెడిట్ కార్డుతో ఖర్చు చేయవచ్చు. ప్రతి నెలా ఖర్చుకు సంబంధించిన బిల్లు వస్తుంది. మీరు సకాలంలో బిల్లును చెల్లిస్తే, వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు పరిమితిలోపు తెలివిగా షాపింగ్ చేస్తే, కంపెనీలు వార్షిక రుసుములను కూడా మాఫీ చేస్తాయి.
అయితే, క్రెడిట్ కార్డు ఉపయోగించడం ఉచితం మాత్రం కాదు. జీవితకాలం ఉచితం అని ఏదీ లేదని గుర్తుంచుకోండి. మీరు ఖర్చు చేస్తే మీరు చెల్లించాలి. షరతులతో పాటు కార్డు రుసుము కూడా సాధారణంగా మాఫీ చేస్తారు. ఇది క్రెడిట్ కార్డు కోణంలో ఒక వైపు మాత్రమే.
గడువు తేదీలోగా పేమెంట్ జరగకపోతే , వెంటనే కంపెనీలు భారీ వడ్డీని వసూలు చేస్తాయి. స్థూల అంచనాల ప్రకారం ఇది 24 నుంచి 40 శాతం మధ్య ఉంటుంది. క్రెడిట్ కార్డ్‌లతో మరొక సమస్య కనీస చెల్లింపు. మీరు గడువు తేదీలో కనీస చెల్లింపు మాత్రమే చేస్తే, CIBIL స్కోర్ ప్రభావితం కాదు. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే.. మీరు క్రెడిట్ కార్డ్ మినిమం బిల్ కడుతున్నారు అంటే మీరు వాడుకున్న సొమ్ముకు వడ్డీ మాత్రమె కడుతున్నారని అర్ధం. మీరు మినిమం డ్యూ పే చేసినా కూడా మీరు అసలు ఖర్చు చేసిన పూర్తి మొత్తం మీకు తరువాతి నెల బిల్లులో కూడా కనిపిస్తుంది.
క్రెడిట్ కార్డ్ ప్రాథమిక విషయాలు అర్థం చేసుకున్న తర్వాత, దాని ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ప్రయాణం చాలా కాస్ట్లీగా మారిపోయింది. దేశంలోని అనేక పెద్ద బ్యాంకులు ఫ్యూయల్ క్రెడిట్ కార్డులను ఇస్తున్నాయి. ఈ క్రెడిట్‌ల సహాయంతో పెరుగుతున్న ఇంధన కొనుగోళ్లపై డబ్బును ఆదా చేసుకోవచ్చు. డిస్కౌంట్‌లతో పాటు, మీరు వాహనాల కోసం పెట్రోల్, డీజిల్‌ను క్రమం తప్పకుండా కొనుగోలు చేస్తే ఈ కార్డ్‌లు మీకు క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్లను కూడా అందిస్తాయి. రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడంపై తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. దీని కోసం SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకుల సహ-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించడంపై తగ్గింపులు అందిస్తున్నాయి. రివార్డ్ పాయింట్‌లతో పాటు కొన్ని రైల్వే లాంజ్‌లను ఉచితంగా ఉపయోగించడం, పెట్రోల్ పంపుల వద్ద ఇంధన సర్‌చార్జి మినహాయింపు వంటి అనేక ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లను EMIలుగా మార్చడం, ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా మీరు మీ జేబుపై భారాన్ని తగ్గించుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ విషయంలో ఒక ప్రత్యేక అంశం ఉంది. ఇది EMIలో అధిక ధర కలిగిన ఉత్పత్తులను కొనుగోలు చేసే సౌలభ్యాన్ని మీకు కల్పిస్తుంది.
క్రెడిట్ కార్డ్‌లకు ప్రయోజనాలు మాత్రమే ఉండవు. మీరు మీ అవసరాన్ని బట్టి మాత్రమే షాపింగ్ చేయాలి. క్రెడిట్ కార్డ్ పరిమితిని చూసి ఎక్కువ ఖర్చు చేయకూడదు. క్రెడిట్ కార్డుల నుంచి క్యాష్ తీసుకుంటే అనేక రకాల ఛార్జీలు వసూలు చేస్తారు. అటువంటి పరిస్థితిలో వడ్డీ రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ పొరపాటు చేస్తే చెల్లించాల్సిన మొత్తం గణనీయంగా పెరుగుతుంది. మీ క్రెడిట్ పరిమితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయండి. మీరు అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితిలో 40% దాటితే మీ క్రెడిట్ కార్డ్ ఖర్చును తగ్గించండి. మీ క్రెడిట్ పరిమితిలో ఎల్లప్పుడూ కనీసం 40% ఆదా చేసుకోండి, తద్వారా అత్యవసర పరిస్థితుల్లో దీన్ని సరిగ్గా ఉపయోగించవచ్చు. మీ కొనుగోళ్ల కోసం ప్లాన్ చేసుకోవాలి. అన్నుకున్న కొనుగోళ్లకు మాత్రమే కార్డ్‌ని ఉపయోగించండి. అదనంగా ఎప్పుడూ ఖర్చు చేయకండి. ఇది ఛార్జీలను పెంచుతుంది. భారీ పెనాల్టీని చెల్లించవలసి ఉంటుంది. ఇప్పుడు ముత్తుకృష్ణన్ చెప్పిన అంశాలు మీకు స్పష్టంగా అర్ధమై ఉంటాయి కదూ..
ఖాతాలో డబ్బు ఉండి, క్రెడిట్ అవసరం లేని వారికి క్రెడిట్ కార్డ్ మంచిది. వారు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా తగ్గింపులు, ఆఫర్‌లను పొందవచ్చు. వారి ఖాతాలో ఉంచిన డబ్బుతో సకాలంలో క్రెడిట్ కార్డ్ చెల్లింపులను చేయవచ్చు.