
నాన్ వెజ్ తినేవారికి బ్యాడ్ న్యూస్. చికెన్ ధరలు కొండెక్కుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం కిలో చికెన్ రూ.230కే లభించగా.. ఇప్పుడు మళ్లీ ఆకాశాన్నంటుతున్నాయి. ఆదివారం కావడంతో చికెన్ తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే పెరిగిన ధరలు సామాన్యులపై భారం పెంచుతోంది. శ్రావణం మాసం పూర్తయిన దగ్గర నుంచి ధరలు కొద్దికొద్దిగా పెరుగుతూ వస్తోన్నాయి. త్వరలో పండుగలు రానున్న క్రమంలో మళ్లీ పుంజుకుంటున్నాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. దసరా, దీపావళి వంటి పండగలు రానుండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.
-హైదరాబాద్‌లో కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.252 పలుకుతుండగా.. డ్రస్స్‌డ్ చికెన్ రూ.223, రిటైల్ లైవ్ బర్డ్ రూ.144, ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.117కు లభిస్తున్నాయి.
-కరీంనగర్ జోన్‌లో కేజీ స్కిన్‌లెస్ చికెన్ రూ.252, డ్రస్స్‌డ్ స్కిన్ రూ.223, రిటైల్ లైవ్ బర్డ్ రూ.144, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.117 పలుకుతున్నాయి.
-విజయవాడ జోన్‌లో కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.266, డ్రస్స్‌డ్ చికెన్ రూ.236, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.125, రిటైల్ లైవ్ బర్డ్ రూ.152 వద్ద కొసాగుతున్నాయి.
సామాన్యుడికి అందుబాటులో ఉండే కోడిగ్రుడ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. చికెన్ ధరలతో పాటు వీటి ధరలు కూడా ఎగబాకాయి. విజయవాడలో 12 గ్రుడ్ల రిటైల్ ధర రూ.80గా ఉంది. హైదరాబాద్ జోన్‌లో 12 గ్రుడ్ల రిటైల్ ధర రూ.76గా ఉంది. మొన్నటివరకు 12 గ్రుడ్ల ధర రూ.70గా ఉండగా.. ఇప్పుడు మరింతగా పెరిగాయి. చికెన్, గ్రుడ్ల ధరలు రెండూ పెరగడం సామాన్యులకు షాక్‌గా చెప్పవచ్చు. మొన్నటివరకు కిలో చికెన్ రూ.230 వద్ద ఉండగా.. ఇప్పుడు రూ.250 నుంచి రూ.270 వద్ద పలుకుతున్నాయి. పండుగల సీజన్ రానున్న క్రమంలో ధరలు మరితం ఎగబాకనున్నాయని చెప్పవచ్చు. పౌల్ట్రీ ఉత్పత్తి, సరఫరా వ్యత్యాసాల కారణంగా వ్యాపారులు ధరలను పెంచారు. ఇప్పటికే నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు పెరిగాయి. షుగర్, వంట నూనె, గ్యాస్ ధరలు పెరిగాయి. దీంతో పాటు గత కొంతకాలంగా ఉల్లి ఘాటెక్కిస్తోంది. కిలో ఉల్లి రూ.70 పలుకుతోంది. పాల ధరలు కూడా ఇటీవల పెరిగాయి. ఎల్‌నీవో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో పంట సాగు తగ్గింది. ధరలు పెరగడానికి ఇదే కారణమవుతోంది.