
ప్రభుత్వ పథకాలు, సేవలు పొందేందుకు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా మారిపోయింది. ఇక బ్యాంకింగ్ సేవలు పొందటంతో పాటు అనేక పనులకు ధృవీకరణ పత్రంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. దీంతో దేశంలోని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతీఒక్కరూ ఆధార్ కలిగి ఉండటమే కాకుండా నిరంతరం దానితో అవసరం పడుతుంది. దీంతో ఆధార్ కార్డుల దుర్వినియోగం కూడా పెరిగిపోతుంది. ఇతరుల ఆధార్ కార్డులను కొంతమంది సంపాదించి తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారు. దీనిని అరికట్టేందుకు యూఐడీఏఐ అనేక ఫీచర్లను ప్రవేశపెడుతోంది. బయోమెట్రిక్ వివరాలను లాక్ లేదా అన్ లాక్ చేసుకునే ఆప్షన్‌తో పాటు మీరు ఆధార్ ఎవరైనా వాడితే తెలుసుకునేందుకు అథెంటికేషన్ హిస్టరీ ఫీచర్ కూడా తీసుకొచ్చింది. దీని ద్వారా మీ ఆధార్ కార్డు ఎవరు వాడారు.. ఎంతుకోసం వాడారు అనే వివరాలు చిటికెలో తెలుసుకోవచ్చు.
బ్యాంకింగ్, ప్రభుత్వ లేదా ఇతర సర్వీసుల కూడా ఆధార్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఓటీపీ ద్వారా ఈకేవైసీ లేదా వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయించుకోవాల్సి ఉంటుంది. మీ ఆధార్‌ను ఎక్కడైనా ఉపయోగించినప్పుడు ఆ వివరాలు యూఐడీఏఐ సిస్టమ్‌లో నమోదవుతాయి. దీనినే ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అంటారు. మీరు ఆధార్ ఎక్కడెక్కడ ఉపయోగించారనేది దీని ద్వారా చెక్ చేసుకోవచ్చు. మీ ఆధార్‌ను మీకు తెలియకుండా ఎవరైనా ఉపయోగించినా దీని ద్వారా తెలుసుకోవచ్చు.
Aadhaar
-యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
-మై ఆధార్ సెక్షన్‌లోకి వెళ్లండి
-ఆధార్ అథెటికేషన్ హిస్టరీ ఆప్షన్‌ను ఎంచుకోండి
-మీ ఆధార్ నెంబర్‌తో పాటు అక్కడ కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి
-మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి
-ఆ తర్వాత వెరిఫైపై క్లిక్ చేయండి
-అక్కడ మీ ఆధార్ ఎక్కడ, ఎప్పుడు ఉపయోగించారు.. ఏ తేదీన ఉపయోగించారు అనే వివరాలు కనిపిస్తాయి.
ఒకవేళ మీ వివరాలను ఎవరైనా తప్పుగా వాడితే యూఐడీఏఐ హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. దీంతో సిబ్బంది చర్యలు తీసుకుంటారు. ఇక వేరేవాళ్లు వాడకుండా మీరు బయోమెట్రిక్ లాన్ చేసుకుంటే సరిపోతుంది. దీని వల్ల మీ బయోమెట్రిక్స్ ఉపయోగించి గుర్తు తెలియని వ్యక్తులు ఎలాంటి ట్రాన్సాక్షన్లు చేయలేదు. ఇది యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీ ఆధార్ ఇతరులు వాడుకోవడానికి కుదరదు. యూఐడీఏఐ వెబ్‌సైట్లో బయోమెట్రిక్ లాక్ లేదా అన్‌లాక్ అనే ఆప్షన్ ఉంటుంది.