
విదేశీ పర్యటన అంటే లక్షల్లో ఖర్చు అవుతుందని భావిస్తున్నారా? అయితే మీకోసం ఒక అద్భుతమైన దేశం సిద్ధంగా ఉంది. చారిత్రాత్మక సిల్క్ రోడ్, నీలి రంగు గోపురాలు, అద్భుతమైన వాస్తుశిల్పానికి నిలయమైన ఉజ్బెకిస్తాన్.. ఇప్పుడు భారతీయ పర్యాటకులకు సరికొత్త బడ్జెట్ స్వర్గధామంగా మారింది. మన దేశం నుండి కేవలం 3 గంటల ప్రయాణ దూరంలో ఉన్న ఈ దేశం తక్కువ ఖర్చుతో రాజరికపు అనుభూతిని అందిస్తోంది.
ఉజ్బెకిస్తాన్ పర్యటనలో భారతీయులకు అతిపెద్ద ప్లస్ పాయింట్ అక్కడి కరెన్సీ మార్పిడి రేటు. ప్రస్తుతం ఒక భారతీయ రూపాయి విలువ సుమారు 131 ఉజ్బెకిస్తానీ సోమ్‌లకు సమానం. అంటే మీరు అక్కడ 100 భారతీయ రూపాయలు ఖర్చు చేస్తే అది 13,000 సోమ్‌లతో సమానం అన్నమాట. దీనివల్ల మీరు అక్కడ చాలా తక్కువ ఖర్చుతో విలాసవంతమైన హోటళ్లలో బస చేయవచ్చు, కుబేరుడిలా విందులు ఆస్వాదించవచ్చు.
భారతదేశం నుండి ఉజ్బెకిస్తాన్ వెళ్లడం చాలా సులభం. ఢిల్లీ, ముంబై నుండి నేరుగా విమాన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కేవలం 3 గంటల విమాన ప్రయాణంతో మీరు ఈ అందమైన దేశానికి చేరుకోవచ్చు. వీసా కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. భారతీయ పర్యాటకుల కోసం సులభమైన ఈ వీసా సౌకర్యం అందుబాటులో ఉంది.
ఉజ్బెకిస్తాన్ ప్రజలకు భారతదేశం అన్నా, బాలీవుడ్ సినిమాలన్నా ఎంతో మక్కువ. అక్కడ భారతీయులకు చాలా గౌరవప్రదమైన స్వాగతం లభిస్తుంది. ఉజ్బెకిస్తాన్ ప్రత్యేక వంటకం పిలాఫ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మాంసాహారులకే కాకుండా శాకాహారులకు కూడా ఇక్కడ రుచికరమైన ఆహార ఎంపికలు పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సమర్‌ఖండ్, బుఖారా వంటి నగరాల్లోని నీలి రంగు గోపురాలు, చారిత్రాత్మక కట్టడాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.
తక్కువ బడ్జెట్‌లో అంతర్జాతీయ స్థాయి విలాసాన్ని అనుభవించాలనుకునే ప్రతి భారతీయుడు తప్పక సందర్శించవలసిన దేశం ఉజ్బెకిస్తాన్. రాజరిక ఆతిథ్యం, చారిత్రాత్మక సంస్కృతి, అనుకూలమైన కరెన్సీ రేటు వెరసి.. మీ తదుపరి విదేశీ యాత్రకు ఇది సరైన గమ్యస్థానం.