Vande Metro Train: కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వే వ్యవస్థలో పలు విప్తవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయో ఒక్కసారిగా భారత రైళ్ల రూపురేఖలు మారిపోయాయి. అధునాతన సాంకేతిక, సకలసౌకర్యాలు, స్టైలిష్ లుక్స్‌తో ట్రాక్‌లపై వేగంతో వందే భారత్ రైళ్లు దూసుకుపోతున్నాయి. ఇదిలా ఉంటే భారతీయ రైల్వే ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
వందే భారత్ రైళ్లు విజయవంతం కావడంతో కొత్తగా వందే మెట్రో రైలును తీసుకొస్తోంది. ఇప్పటికే ఈ రైళ్ల తయారీ జరుగుతోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కొత్తగా అందుబాటులోకి రానున్న ఈ రైళ్లను 1950, 60లలో తయారైన రైళ్లతో భర్తీ చేయనున్నామని మంత్రి తెలిపారు. ప్రపంచ స్థాయి వందే మెట్రోని రూపొందిస్తున్నామని, వచ్చే ఏడాది మే లేదా జూన్ నాటికి ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. అంతేకాకుండా దేశీయంగా రూపొందించిన తొలి హైడ్రోజన్ రైలును 2023 డిసెంబర్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ వందే మెట్రో రైళ్లనె పెద్ద ఎత్తున తయారు చేయనున్నట్లు మంత్రి చెప్పారు.
మధ్యతరగతి, పేదల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వందే మెట్రో రైళ్లను నిర్మిస్తున్నామన్న మంత్రి.. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక స్థోమత లేని మధ్య, దిగువ తరగతి ప్రజలపై దృష్టి పెడుతున్నారని తెలిపారు. వందే భారత్ లాగా వందే మెట్రో రైళ్లు కూడా పూర్తిగా ఇండియన్ మేడ్ అని చెప్పుకొచ్చారు. భారతీయ ఇంజనీర్లు వందే మెట్రో రైలును రూపొందిస్తున్నారని మంత్రి తెలిపారు. ఇక రైల్వే ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్ర మంత్రి తోసిపుచ్చారు. రైల్వేలు ఒక వ్యూహాత్మక రంగమని అది ప్రభుత్వంలోనే ఉంటుందని తేల్చి చెప్పారు.
ఇక ఇండియన్ రైల్వే వందే భారత్-3 రూపకల్పనపై కసర్తుత చేస్తోందని తెలిపిన మంత్రి వీటిలో స్లీపర్ క్లాస్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ రైళ్లు సుదీర్ఘ ప్రయాణానికి కూడా ఉపయోగించబడతాయన్నారు. ఇక బుల్లెట్ రైలు కారిడార్ గురించి మాట్లాడుతూ.. ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణానికి సంబంధించి, ఇది శరవేగంగా జరుగుతుందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..