
గత కొంతకాలంగా బంగారం ధరల పెరుగుదలతో ఆందోళన చెందుతున్న మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం బంగారం బేస్ దిగుమతి ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణ సెగతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు ఇది గొప్ప ఊరటనిచ్చే అంశం. ప్రభుత్వం 10 గ్రాముల బంగారంపై బేస్ దిగుమతి ధరను 12 డాలర్ల మేర తగ్గించింది. గతంలో 1664 డాలర్లుగా ఉండగా.. ఇప్పుడు అది 1652 డాలర్లకు చేరింది.
సాధారణంగా దేశంలోకి దిగుమతి అయ్యే బంగారంపై కస్టమ్స్ సుంకం మరియు ఇతర దిగుమతి పన్నులను లెక్కించడానికి ప్రభుత్వం ఒక నిర్దిష్ట ధరకు ప్రామాణికంగా తీసుకుంటుంది. దీనే టారిఫ్ విలువ లేదా బేస్ దిగుమతి ధర అంటారు. ఇప్పుడు ఈ బేస్ ధర తగ్గడం వల్ల దిగుమతిదారులపై భారం తగ్గి.. దేశీయ మార్కెట్లోకి బంగారం తక్కువ ధరకు చేరుతుంది. అంతర్జాతీయ ధరల హెచ్చుతగ్గుల వల్ల పెరిగిన ఖర్చులను ఎదుర్కొంటున్న జువెలర్స్ మరియు బులియన్ వ్యాపారులకు ఈ నిర్ణయం పెద్ద మద్దతుగా నిలుస్తుంది. దిగుమతి ఖర్చులు తగ్గడంతో, ఆభరణాల వ్యాపారులు ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేసే అవకాశం ఉంది. తద్వారా దేశీయంగా బంగారం ధరలు కొంతమేర తగ్గే ఛాన్స్ ఉంది.
అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా దేశీయ మార్కెట్ ధరలను సమతుల్యం చేయడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ ఈ సవరణలు చేసింది. మన దేశీయ మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్లతో పోటీ పడేలా ఉండటం మరియు వినియోగదారులపై ధరల ఒత్తిడిని తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం. ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో ఈ ప్రభావం దేశీయ రిటైల్ మార్కెట్‌పై ఎలా ఉంటుందో వేచి చూడాలి.