
దేశంలోని ప్రజలందరికీ ఇంటర్నెట్ సౌకర్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం వాణి పేరుతో ఓ కార్యక్రమాన్ని ఎప్పటినుంచో నిర్వహిస్తుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా దీనిని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా పబ్లిక్ ప్రదేశాల్లో వై-ఫై సౌకర్యాన్ని కల్పిస్తోంది. రైల్వే స్టేషన్లు, బస్టాపులు, బస్టాండ్‌లు, మాల్స్, ఇతర జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వై-ఫై సదుపాయం అందిస్తోంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తాజాగా పీఎం వాణి కార్యక్రమంలో కీలక మార్పులు చేసింది. హాట్ స్పాట్లు గుర్తింపు, వై-ఫై నేమ్స్, సులభంగా ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకునేలా అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. 8 వారాల్లోగా వీటిని అమల్లోకి తీసుకోవాలని సూచించింది. పీఎం వాణిలో రానున్న కొత్త మార్పుల గురించి ఇప్పుడు చూద్దాం.
పబ్లిక్ ప్రదేశాల్లో ప్రజలకు తక్కువ ధరకే ఇంటర్నెట్ సౌకర్యం అందించేందుకు కేంద్రం దీనిని తీసుకొచ్చింది. థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లు, పబ్లిక్ డేటా ఆఫీసులు, పీడీఓ అగ్రిగేటర్ల సాయంతో అమలు చేస్తోంది. ఇంటి బయట ప్రజలకు వేగవంతమైన, తక్కువ ధరకే వై-ఫై సౌకర్యం కల్పిస్తోంది. విద్యార్థులు, ప్రయాణికులు, దుకాణాదారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
-వై-ఫై సులువుగా ఉపయోగించుకునేందుకు క్యూఆర్ కోడ్ విధానం తీసుకురానున్నారు. ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే వై-ఫై ఉపయోగించుకునే విధంగా మార్పులు చేయనున్నారు.
-ఇక తక్కువ ఖర్చుతో కూడా డేటా ప్లాన్లను ప్రవేశపెట్టాలని ప్రొవైడర్లకు కేంద్రం సూచించింది. కేవలం 15,30,60 నిమిషాల పాటు చెల్లుబాటు అయ్యే చిన్న ప్యాక్‌లను ప్రవేశపెట్టాలని ఆదేశించింది. దీంతో తక్కువ సమయం ఇంటర్నెట్ అవసరమైనవారికి ఇది ఉపయోగపడనుంది
-ఇక వై-ఫైను సులువుగా గుర్తించేందుకు పీఎం వాణి హాట్ స్పాట్ పేర్లు, ఎస్‌ఎస్‌ఐడీ పేర్లు కూడా ఒకేలా ఉండేలా మార్చనుంది.
పీఎం వాణి కార్యక్రమంపై కేంద్రం సమాచార, ప్రసారాలశాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎక్స్‌లో వివరించారు. పీఎం వాణి ద్వారా దేశవ్యాప్తంగా అందరికీ సులభంగా పబ్లిక్ వై-ఫై అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని అన్నారు. ఇప్పుడు PM-WANI వినియోగాన్ని మరింత సులభతరం చేస్తున్నామని, QR కోడ్ లాగిన్ సౌకర్యంతో మొబైల్ ద్వారా QR స్కాన్ చేసి ల్యాప్‌టాప్‌ను సులభంగా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసుకునే అవకాశం కల్పించనున్నామన్నారు. 15 నిమిషాలు, 30 నిమిషాలు, 60 నిమిషాల స్వల్ప వ్యవధి ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకురావాలని హాట్‌స్పాట్ ఆపరేటర్లకు సూచించామన్నారు. ప్రతి పౌరుడికి సులభమైన ఇంటర్నెట్ సౌకర్యం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
PM-WANI is our platform for universal public Wi-Fi access — and we are making it easier to use. QR-based login now lets you connect your laptop simply by scanning a code on your phone. We have also advised hotspot operators to offer short-duration plans of 15, 30 and 60 minutes… pic.twitter.com/tCeaGjqoaF
— Dr. Chandra Sekhar Pemmasani (@PemmasaniOnX) May 22, 2026