PMJJBY PMSBY:ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ( PMJJBY),ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY)పథకాల ప్రీమియంను పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది . ఈ రెండు పథకాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రీమియం పెంచాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం తెలిపింది. PMJJBY పథకానికి ఏడాదికి రూ.330 వసూలు చేసేవారు. కానీ జూన్ 1 నుంచి 436 చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా PMSBY పథకం వార్షిక ప్రీమియం గతంలో రూ.12 ఉండగా దానిని రూ.20కి పెంచారు. రెండు పథకాల కొత్త రేట్లు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రీమియం 32 శాతం, PMSBYలో 67 శాతం పెరిగింది. రెండు పథకాల క్లెయిమ్ నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుని ప్రీమియం పెంచాలని నిర్ణయించారు. ఈ రెండు పథకాలు దీర్ఘకాలంలో పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. క్లెయిమ్‌లు త్వరగా పరిష్కరిస్తారు కాబట్టి పథకాన్ని అమలు చేయడానికి ప్రీమియంను పెంచుతున్నట్లు కేంద్రం వివరణ ఇచ్చింది.
మార్చి 31, 2022 నాటికి, PMJJBY యాక్టివ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 6.4 కోట్లు, అలాగే PMSBY యాక్టివ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 22 కోట్లుగా ఉంది. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ప్రారంభించినప్పటి నుంచి రూ. 1,134 కోట్లు ప్రీమియంగా డిపాజిట్ అయింది. అయితే మార్చి 31, 2022 వరకు ఈ పథకం క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో రూ. 2,513 కోట్లు విడుదల అయ్యాయి. మరోవైపు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కోసం రూ. 9,737 కోట్ల ప్రీమియం వసూలు చేశారు. మార్చి 31, 2022 వరకు క్లెయిమ్‌గా రూ. 14,144 కోట్లు విడుదల చేశారు. ఈ రెండు స్కీమ్‌లలో క్లెయిమ్ డబ్బు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) ద్వారా లబ్ధిదారుని ఖాతాలో జమ అవుతుంది.
ఈ రెండు పథకాలు కరోనా కాలంలో కస్టమర్‌లకు చాలా సహాయపడ్డాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రభుత్వం రెండు పథకాల ప్రయోజనాలను నిశితంగా పరిశీలించింది. పథకం ప్రయోజనాలను మరింత మందికి చేరడానికి కొన్ని అవసరమైన చర్యలు తీసుకుంది. కరోనా కారణంగా మరణించిన వెంటనే ఉద్యోగులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి క్లెయిమ్‌ను పరిష్కరించాలని ప్రభుత్వం బ్యాంకులను ఆదేశించింది. పథకం ప్రారంభించినప్పుడు క్లెయిమ్ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కానీ నేడు అది మారిపోయింది. ఇదిలావుండగా గత 7 ఏళ్లలో ప్రీమియం పెరగలేదు. దీనివల్ల బీమా కంపెనీలు, బ్యాంకులు నష్టాలను చవిచూస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి