కార్డు మోసాలకు చెక్ పెట్టే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇకపై ఏటీఎం కార్డు లేకుండానే డబ్బులు విత్ డ్రా చేసే సదుపాయాన్ని అన్ని బ్యాంకులు అనుమతించాలని ఆర్‌బీఐ కీలక ప్రకటన విడుదల చేసింది. తాజాగా ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించిన ఆర్బీఐ.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ దేశవ్యాప్తంగా కొన్ని బ్యాంకులు మాత్రమే అమలు చేస్తున్నాయి. తమ ఖాతాదారులకు సొంత బ్రాంచ్ ఏటీఎంలలోనే కార్డ్‌లెస్ లావాదేవీలు చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి.
“UPI విధానం ద్వారా అన్ని బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల్లో కార్డ్‌లెస్ డబ్బు విత్‌డ్రాను అందుబాటులోకి తీసుకురావాలి. ఇది లావాదేవీల సౌలభ్యాన్ని పెంపొందించడంతో పాటు, కార్డు మోసాలకు కూడా చెక్ పెట్టేందుకు సహాయపడుతుంది.” అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో ప్రకటించారు.
కార్డులెస్ ట్రాన్స్‌షన్స్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) ద్వారా ఖాతాదారులు అథరైజేషన్ జరుగుతుందన్నారు. ఎన్‌పీసీఐ, ఏటీఎం నెట్‌వర్క్స్, బ్యాంకులకు ఇందుకు సంబంధించిన ఆదేశాలను త్వరలోనే జారీ చేస్తామని చెప్పారు. దీనిబట్టి చూస్తే దేశవ్యాప్తంగా త్వరలోనే ఏటీఎం కార్డు లేకుండానే మనీ విత్ డ్రా అమలులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.