Bullet Train Project: దేశంలో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు మరింత ఆలస్యం.. కారణం ఏంటో వెల్లడించిన రైల్వే మంత్రి

|

Feb 02, 2023 | 4:42 PM

దేశంలో టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా రైల్వే వ్యవస్థను మరింతగా మెరుగుపర్చేందుకు మోడీ సర్కార్ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే శాఖ కొత్త..

Bullet Train Project: దేశంలో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు మరింత ఆలస్యం.. కారణం ఏంటో వెల్లడించిన రైల్వే మంత్రి
Bullet Train Project
Follow us on

దేశంలో టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా రైల్వే వ్యవస్థను మరింతగా మెరుగుపర్చేందుకు మోడీ సర్కార్ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే శాఖ కొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. మరిన్ని రైళ్లతో పాటు వందేభారత్‌ రైళ్లను కూడా నడుపుతోంది. ఇక బుల్లెట్‌ రైలును కూడా అందుబాటులోకి తీసుకువచ్చేలా కేంద్ర చర్యలు చేపడుతోంది. ఇక బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ సిద్ధం కావడానికి 3 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఈ విషయమై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. 2026 ఆగస్టు నెల నుండి దేశంలోని మొట్టమొదటి బుల్లెట్ రైలు ట్రాక్‌పై పరుగెత్తడం ప్రారంభం అవుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రాజెక్టును నిరంతరం పర్యవేక్షిస్తున్నారని అన్నారు. జపాన్ ప్రభుత్వ సహకారంతో 2026 ఆగస్టు నుంచి బుల్లెట్ రైలు పరుగులు తీయగలదన్న నమ్మకం ఉందని రైల్వే మంత్రి అభిప్రాయపడ్డారు.

కాగా, ముందుగా బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును 2022 ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 14 సెప్టెంబర్ 2017న, ప్రధాని మోదీ అప్పటి జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ముంబై – అహ్మదాబాద్ మధ్య ప్రతిష్టాత్మక బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2022 ఆగస్టు 15న దేశంలో బుల్లెట్‌ రైలు పరుగులు పెట్టనున్నట్లు ప్రకటించానా.. అది నెరవేరలేదు. కానీ ఇప్పటి వరకు బుల్లెట్ రైలు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే సందేహం ఉంది. అయితే 2026 ఆగస్టు నుంచి బుల్లెట్ రైలు నడుస్తుందని రైల్వే మంత్రి తెలిపారు.

బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ 4 సంవత్సరాలు ఆలస్యం :

కాగా, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో మూడున్నరేళ్లు పడుతుందని రైల్వే మంత్రి ప్రకటనతో స్పష్టమవుతోంది. గత 2022లో లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా రైల్వే మంత్రి ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు ఆలస్యంగా నడుస్తోందని చెప్పారు. మహారాష్ట్రలో భూసేకరణలో జాప్యం, కోవిడ్-19 ప్రభావంతో పాటు కాంట్రాక్టుల ఖరారులో నిరంతర జాప్యం కారణంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఆలస్యం అవుతోందని అన్నారు. భూసేకరణ, కాంట్రాక్టులన్నింటినీ ఖరారు చేయడం, ఇతర సమయపాలన పూర్తయిన తర్వాతే ఆలస్యమవడం వల్ల ప్రాజెక్టు వ్యయం ఎంత పెరిగిందో అంచనా వేయవచ్చని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ప్రాజెక్టు వ్యయం పెరగనుంది:

ముంబై – అహ్మదాబాద్ మధ్య నడుస్తున్న మొదటి హై-స్పీడ్ బుల్లెట్ ప్రాజెక్ట్ జపాన్ ప్రభుత్వం నుండి సాంకేతిక, ఆర్థిక సహాయం తర్వాత డిసెంబర్ 2015 లో ఆమోదించబడింది. 2015లో బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు రూ.1.08 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ వివిధ కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆలస్యమైన తర్వాత ఖర్చు పెరుగుతుందని భావిస్తున్నారు. జపాన్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం.. జపాన్ ప్రభుత్వం మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 81 శాతం రుణాన్ని 0.1 శాతం వడ్డీ రేటుతో అందిస్తుంది. ప్రాజెక్ట్ వాస్తవ వ్యయం, అవసరమైతే రుణ మొత్తాన్ని కూడా సవరించవచ్చని కూడా ఎంయూలో పేర్కొన్నారు. రుణాన్ని 15 ఏళ్ల గ్రేస్ పీరియడ్‌తో పాటు 50 ఏళ్లలో తిరిగి చెల్లించాలి.

బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం సేకరించాల్సిన 1396 హెక్టార్ల భూమిలో 1248 హెక్టార్ల భూమిని సేకరించినట్లు రైల్వే మంత్రి గతేడాది పార్లమెంట్‌లో ఇచ్చిన సమాధానంలో తెలిపారు. ముంబై – అహ్మదాబాద్ మధ్య 508 కి.మీ పొడవైన బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం 353 మేర కి.మీ ప్రాజెక్ట్ గుజరాత్, దాద్రానగర్‌ హవేలీలో  డిసెంబర్ 2020 నుండి సివిల్ వర్క్స్ పనులు ప్రారంభమయ్యాయి. అహ్మదాబాద్‌లోని సబర్మతి, ముంబై మధ్య 508 కిలోమీటర్ల పొడవైన బుల్లెట్ రైలు ప్రాజెక్టులో మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి. 360 కి.మీ గరిష్ట వేగంతో ఈ బుల్లెట్ రైలు వేగాన్ని పెంచగలదు. అయితే ఆపరేటింగ్ వేగం 320 కి.మీ. ముంబై నుండి సబర్మతి మధ్య దూరాన్ని 2.07 గంటల్లో అధిగమించవచ్చు. అన్ని స్టేషన్లలో ఆగిన తర్వాత ప్రయాణం 2.58 గంటల్లో పూర్తవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి