ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి, రష్యా, సౌదీ అరేబియా మధ్య చమురు ధరలకు సంబంధించి సాగుతున్న పైస్ వార్.. కారణంగా దేశీయ మార్కెట్ కుదేలయింది. ఒక్కసారిగా దలాల్ స్ట్రీట్ వణికిపోగా..ఇన్వెస్టర్ల ఆందోళన భారీ అమ్మకాలకు తెర తీసింది. సెన్సెక్స్ లో దాదాపు 800 కి పైగా షేర్లు 52 వారాల కనిష్ట స్థాయికి దిగజారగా.. బ్యాంకింగ్, ఆటో, ప్రైవేటు రంగ ఆయిల్ షేర్లు నష్టాలను మూట గట్టుకున్నాయి. ఒక్క రోజే రూ. 7 లక్షల కోట్లు ఆవిరయ్యాయి.
ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయెన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర బీ ఎస్ ఈ లో 13.65 శాతం పతనం కాగా.. పది లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ లో 2.7 లక్షల కోట్లు హరించుకుపోయాయి. సెన్సెక్స్ 1942 పాయింట్ల మేర, నిఫ్టీ 538 పాయింట్ల మేర నష్టపోయాయి. బ్లాక్ మండే గా దీన్ని అభివర్ణిస్తున్నారు. లండన్ మార్కెట్లో 140 బిలియన్ పౌండ్లు ఆవిరైపోయాయి. ఇది నాలుగేళ్ల కనిష్ట స్థాయికి చేరింది. 1991 లో గల్ఫ్ యుధ్ధం అనంతరం గ్లోబల్ ఆయిల్ మార్కెట్లు ఇంతగా పతనం కావడం ఇదే మొదటిసారి. ‘మార్కెట్స్ బ్లడ్ బాత్’ అని కూడా ఈ పరిణామాన్ని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు.