అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్.. ఏటీఎమ్ విత్‌డ్రా నుండి రైలు టికెట్ వరకు అన్నీ ఛేంజ్..!

అక్టోబర్ 1 నుంచి కొన్ని కీలక రీల్స్ మారనున్నాయి. బ్యాంకింగ్, రైల్వే టికెట్ బుకింగ్, పెన్షన్ పథకాలలో ఈ నిబంధనలు మారనున్నాయి. ఈ మార్పులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి సాధారణ ప్రజల దైనందిన జీవితాలను ప్రభావితం చేస్తాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్.. ఏటీఎమ్ విత్‌డ్రా నుండి రైలు టికెట్ వరకు అన్నీ ఛేంజ్..!
Big Changes From October 1

Updated on: Sep 30, 2025 | 2:19 PM

అక్టోబర్ 1 నుండి దేశంలో బ్యాంకింగ్, రైల్వే టికెటింగ్, పోస్టల్ సేవలు, పెన్షన్ పథకాలతో సహా పలు రంగాలలో కొత్త నిబంధనలు, రుసుములు అమలులోకి రానున్నాయి. ఈ మార్పులు సామాన్య ప్రజల దైనందిన లావాదేవీలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి.

1. ఆర్‌బిఐ చెక్ క్లియరింగ్: మరింత వేగం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 4 నుండి చెక్ క్లియరింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ప్రస్తుత ‘బ్యాచ్ సిస్టమ్’ స్థానంలో ఇన్‌స్టాంట్ క్లియరింగ్ విధానం వస్తుంది. ఈ మార్పు రెండు దశల్లో జరుగుతుంది. ఇది బ్యాంకింగ్ లావాదేవీలను గణనీయంగా వేగవంతం చేసి, చెక్కులపై తక్షణ చెల్లింపును నిర్ధారిస్తుంది.

2. ఐఆర్‌సీటీసీ: ఆధార్ ఉంటేనే టికెట్ బుకింగ్

రైల్వే టికెట్ బుకింగ్ సంస్థ ఐఆర్‌సీటీసీ అక్టోబర్ 1 నుండి కొత్త నిబంధన అమలు చేస్తోంది. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌కు ఇకపై ఆధార్-ప్రామాణీకరణ తప్పనిసరి చేసింది. మోసాలను, దుర్వినియోగాన్ని అరికట్టి, టికెటింగ్ వ్యవస్థలో పారదర్శకత, భద్రత పెంచడం ఈ మార్పు ముఖ్య ఉద్దేశం.

3. పెన్షన్ పథకాలు & పెట్టుబడి నియమాలు

NPS, UPS, అటల్ పెన్షన్ వంటి పథకాల్లో మార్పులు వచ్చాయి:

UPS పెన్షన్ పథకంలో ఉన్న ఉద్యోగులు NPSకి మారడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30, 2025. అక్టోబర్ 1 తర్వాత ఈ మార్పు సాధ్యం కాదు.

ప్రభుత్వేతర NPS చందాదారులు ఇకపై తమ పెట్టుబడిలో 100శాతం వరకు ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తారు.

CRA ఫీజులు: పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలు వసూలు చేసే రుసుములను సవరించింది. అక్టోబర్ 1 నుండి కొత్త ఫీజులు వర్తిస్తాయి. దీనివల్ల పెన్షనర్లకు అదనపు ఛార్జీలు విధించే అవకాశం ఉంది.

4. ఇండియా పోస్ట్: స్పీడ్ పోస్ట్ రేట్ల పెంపు

అక్టోబర్ 1 నుండి ఇండియా పోస్ట్ స్పీడ్ పోస్ట్ సేవలు మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. కస్టమర్లు ఇప్పుడు ఓటీపీ ఆధారిత డెలివరీని ఎంచుకోవచ్చు. దీని వలన డెలివరీ మరింత సురక్షితంగా ఉంటుంది.

5. బ్యాంకింగ్ ఛార్జీలలో మార్పులు

అనేక ప్రముఖ బ్యాంకులు తమ సేవా ఛార్జీలను అక్టోబర్ 1 నుండి సవరిస్తున్నాయి:

ఎస్ బ్యాంక్: ఈ బ్యాంక్ తన శాలరీ అకౌంట్ ఛార్జీలను సవరిస్తోంది. నగదు లావాదేవీలు, ఏటీఎం విత్ డ్రా పరిమితులు, డెబిట్ కార్డ్ ఛార్జీలు, చెక్ బౌన్స్ జరిమానాలు మారుతాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్: పీఎన్‌బీ లాకర్ అద్దె, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ వైఫల్య ఛార్జీలు, నమోదు ఛార్జీలను పెంచుతోంది.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన ప్రీమియం ఇంపీరియా కస్టమర్ల కోసం కొత్త అర్హత ప్రమాణాలను అమలు చేయనుంది. ప్రోగ్రామ్‌లో కొనసాగడానికి కస్టమర్‌లు ఈ కొత్త నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఈ మార్పుల నేపథ్యంలో వినియోగదారులు తమ బ్యాంకింగ్, ప్రయాణ అలవాట్లను, అలాగే పెన్షన్ పెట్టుబడులను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.

మరిన్ని బిజినెస్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..