
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. పీఎఫ్ ఆన్‌లైన్ సర్వీసులు జులై 2వ తేదీ నుంచి పున:ప్రారంభం కానున్నాయి. సిస్టమ్ అప్‌గ్రేడేషన్‌లో భాగంగా జూన్ 26వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు యూఏఎన్ పోర్టల్, ఉమాంగ్ యాప్‌లో పీఎఫ్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఈపీఎఫ్‌ఓ ఇటీవల ప్రకటించింది. జులై1వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయంటూ ప్రకటించింది. దీంతో నేడు వెబ్ సైట్ ఓపెన్ అవుతుందని పీఎఫ్ ఖాతాదారులు ఎదురుచూశారు. అయితే సిస్టమ్ అప్డేట్ చేయడం ఇంకా పూర్తి కాకపోవడంతో నేడు తిరిగి ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో గురువారం నుంచి డిజిటల్ సేవలను పునరుద్దరించనున్నట్లు సోషల్ మీడియా అకౌంట్లలో ఈపీఎఫ్ఓ ప్రకటించింది. దీంతో పీఎఫ్ ఆన్‌లైన్ సర్వీసులు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయంపై స్పష్టత వచ్చినట్లయింది.
మెరుగైన డిజిటల్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈపీఎఫ్‌ఓ సర్వీసులు జులై 2న అర్థరాత్రి 12 గంటల నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. సేవల్లో తాత్కాలిక అంతరాయానికి ఈపీఎఫ్ఓ చింతిస్తుంది. మీ ఓపికను అభినందిస్తున్నాం అంటూ ఈపీఎఫ్‌ఓ తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లలో పేర్కొంది. క్లెయిమ్స్ ప్రాసెసింగ్ ప్లాట్‌ఫామ్‌ను అప్‌గ్రేడ్ చేసే లక్ష్యంతో ప్రధాన సిస్టమ్ మైగ్రేషన్, డేటాబేస్ ఏకీకరణ ప్రక్రియను కొనసాగిస్తున్నందున ఆన్‌లైన్ సేవల నిలిపివేత గడువును ఒక రోజు పాటు పొడిగించింది. సేవల పంపిణీ, ప్రాసెసింగ్ సామర్థ్యం, మొత్తం వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన డేటాబేస్ ఏకీకరణ, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లో భాగంగానే ఈ తాత్కాలిక నిలిపివేత ఉందని ఈపీఎఫ్ఓ తెలిపింది. జూన్ 26న ప్రారంభమైన నిర్వహణ పనులు.. జూలై 1 వరకు కొనసాగుతాయి. జులై 2 నుంచి యథావిధిగా సేవలు ప్రారంభమవుతాయి. ఇటీవలి సంవత్సరాలలో ఈపీఎఫ్ఓ చేపట్టిన సుదీర్ఘ సేవా అంతరాయాలలో ఇది ఒకటిగా చెప్పవచ్చు.
ఆన్‌లైన్ సేవలు నిలిచిపోవడం వల్ల ఉద్యోగులు, యజమానులువ మెంబర్ ఇంటర్‌ఫేస్, ఎంప్లాయర్ ఇంటర్‌ఫేస్‌లోకి లాగిన్ అవ్వలేరు. అలాగే ఈ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అందుబాటులో ఉన్న అన్ని ఆన్‌లైన్ సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో ఈపీఎఫ్ఓ క్లెయిమ్ సమర్పించడం, క్లెయిమ్ స్టేటస్ చెక్ చేసుకోవడం, పాస్‌బుక్ యాక్సెస్ చేయడం, వ్యక్తిగత వివరాలను అప్డేట్ చేసుకోవడం, బదిలీ అభ్యర్థనలను సమర్పించడం లాంటి ఆన్‌లైన్ సేవలన్నీ నిలిచిపోయాయి. ఇప్పటికే మీరు క్లెయిమ్ కోసం దరఖాస్తు సమర్పించి ఉంటే ఆన్‌లైన్ సేవలు ప్రారంభమయ్యాక ప్రాసెస్ చేస్తారు. రేపటి నుంచి ఈ సేవలన్నీ తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో వినియోగదారులు అవసరమైతే ఈపీఎఫ్ఓ హెల్ప్ లైన్ నెంబర్ 14470ను సంప్రదించవచ్చు.