Bank Holidays: బిగ్ న్యూస్.. ఈ వారంలో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్..

బ్యాంకింగ్ ఖాతాదారులకు అలర్ట్. ఈ వారంలో ఏకంగా వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు. దీని ప్రభావం బ్యాంక్ కార్యకలాపాలపై పడనుంది. అంతేకాకుండా రిపబ్లిక్ డే, ఆదివారం సెలవులు ఒకేసారి రావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి.

Bank Holidays: బిగ్ న్యూస్.. ఈ వారంలో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్..
Banks Close

Updated on: Jan 22, 2026 | 1:26 PM

ఐటీ ఉద్యోగుల తరహాలో తమకు కూడా వారంలో ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకింగ్ సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇప్పటికే సమ్మె నోటీసులు కూడా యాజమాన్యాలకు అందించాయి. ఈ నిర్ణయంతో దేశంలోని అన్ని బ్యాంకులు జనవరి 24 నుంచి 27వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజుల పాటు మూత పడనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులపై కూడా సమ్మె ఎఫెక్ట్ పడనుంది. దీంతో నాలుగు రోజు పాటు బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం కలగొచ్చు. బ్యాంక్ సేవలపై ఆధారపడేవారు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉన్నందున ముందే లావాదేవీలు లేదా ఇతర పనులు నిర్వహించుకోవడం మంచిది.

జనవరి 27న సమ్మె

బ్యాంకుల్లో ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను డిమాండ్ చేస్తూ ఈ నెల 27న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలోని బ్యాంక్ ఉద్యోగులు, సంఘాలు సమ్మె చేపట్టనున్నాయి. ఈ యూనియన్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లోని ఉద్యోగులు సభ్యులుగా ఉన్నారు. దీంతో ఆ రోజు బ్యాంకు సేవలను నిలిపివేసి ఆందోళనలు చేపట్టనున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని రోజులు ఉండాలని బ్యాంక్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మార్చి 2024న దీనికి సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోషియేషన్‌తో కేంద్రం చర్చలు జరపగా.. కేంద్రం కూడా అంగీకారం తెలిపింది. ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్దమైనప్పటికీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. శనివారం సెలవు ప్రకటిస్తే మిగతా రోజుల్లో ఎక్కువ సమయం పనిచేయడానికి తాము సిద్దంగా ఉన్నామని బ్యాంక్ సంఘాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 24 గంటలు బ్యాంక్ డిజిటల్ సేవలు అందుబాటులో ఉన్నందున తమ అవసరం తక్కువగా ఉంటుందని, 5 రోజులు మాత్రమే పనిదినాలు ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నాయి. అయితే ఆర్బీఐ మాత్రం అమలు చేసేందుకు సిద్దంగా లేదు. దీంతో బ్యాంక్ సంఘాలు పదే పదే ఆందోళనలు చేపడుతున్నాయి.

నాలుగు రోజులు బ్యాంక్‌లు క్లోజ్

జనవరి 27న బ్యాంక్ సంఘాల సమ్మె జరగనుండటంతో ఆ రోజు బ్యాంక్ సేవల్లో అంతరాయం ఏర్పడనుంది. ఇక జనవరి 24న నాల్గొవ శనివారం, 25వ తేదీన ఆదివారం, 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా బ్యాంకులు మూతపడతాయి. 27న బంద్ కారణంతో వరుసగా నాలుగు రోజుల పాటు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో బ్యాంక్ కస్టమర్లు అందరూ అలర్ట్ కావడం మంచిది. బ్యాంకుల్లో ఏవైనా పనులు ఉంటే ముందే చేసుకోవడం మంచిది.