
ఈ ఏడాది ఫిబ్రవరి 18న క్వాలిటీ పవర్ ఎక్విప్ మెంట్స్ రూ.859 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీవోకు వచ్చింది. ఈ తర్వాత ఇప్పుడే ఏథర్ ఎనర్జీ రానుంది. రెండింటి మధ్య సుమారు రెండు నెలలుగా ఎటువంటి కంపెనీలు రాలేదు. కాగా.. ఏథర్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూకి రూ.304-321 మధ్య ధరలను ప్రకటించింది. ఇష్యూ ఈనెల 28 నుంచి 30 వరకూ కొనసాగుతుంది. దీనిలో భాగంగా రూ.2,626 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనున్నారు. వీటితో పాటు మరో 1.1 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయించనున్నారు. వీటి ద్వారా సుమారు రూ.2,981 కోట్లను కంపెనీ సమీకరించనుంది.
బెంగళూరుకు చెందిన ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లు, బ్యాటరీ ప్యాక్ లు, చార్జింగ్ మౌలిక సదుపాయాలు, సహాయక సాఫ్ట్ వేర్ రంగాల్లో పెట్టుబడులు పెడుతుంది.. ఉత్పత్తి, సాంకేతిక ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తూ.. పూర్తి ఇంటిగ్రేడెట్ ఈవీ తయారీదారుగా పనిచేస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో 109,577 ఎలక్ట్రిక్ టూ వీలర్లను విక్రయించింది. దేశంలో 265 అనుభవ కేంద్రాలు, 233 సేవా కేంద్రాలను కలిగి ఉంది. అలాగే నేపాల్ లో ఐదు అనుభవ, నాలుగు సేవా కేంద్రాలు, శ్రీలంకలో పది అనుభవ, ఒక సేవా కేంద్రం నిర్వహిస్తోంది.