
కరెన్సీ నోట్ల తయారీలో జంతువుల కొవ్వు ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? అవును.. ఇది నిజమే. కానీ భారత్‌లో కాదండోయ్.. విదేశాల్లోని కొన్ని దేశాల్లో కరెన్సీ నోట్ల తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగిస్తున్నారు. బ్రిటన్‌తో పాటు పాటు ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్, న్యూజిలాండ్, కెనడా, మలేషియా, సింగపూర్ దేశాల కరెన్సీలో జంతువుల కొవ్వును వాడుతున్నారు. ఈ దేశాల్లో పాలిమర్ నోట్లను ఉపయోగిస్తున్నారు. వీటిల్లో జంతువుల కొవ్వు నుంచి తీసిన టాల్లో అనే పదార్ధాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే టాల్లోను నేరుగా ఉపయోగించకుండా.. దాని నుంచి తీసిన రసాయనాలను వాడుతున్నారు.
నోట్లు బ్యాంక్ నోట్ షీట్‌కు అంటుకోకుండా టాల్లో నుంచి తీసిన రసాయనం ఉపయోగపడుతుంది. ఇక ప్రింటింగ్, కటింగ్ సమయంలో కూడా అంటుకోకుండా ఇది సహాయపడుతుంది. దీని వల్ల నోట్ల ఉత్పత్తి మరింత వేగంగా, సజావుగా జరుగుతుంది. ఘర్షణను తగ్గించి యంత్రం గుండా పదార్థం ప్రవాహాన్ని ఇది పెరుగుపరుస్తుంది. అందుకే కరెన్సీ నోట్ల తయారీలో జంతువుల కొవ్వు నుంచి తీసిన టాల్లో అనే పదార్ధాన్ని ఉపయోగిస్తున్నారు. 2016లో బ్రిటన్‌లో కొత్తగా 5,10 పౌండ్ల పాలిమర్ నోట్లను విడుదల చేశారు. ఇందులో టాల్లో అనే పదార్ధాన్ని ఉపయోగించినట్లు తేలింది. దీంతో హిందూ, సిక్కు సంఘాలతో పాటు శాకాహార సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. వివాదం చెలరేగడంతో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ స్పందించింది. ముందుగా ఈ విషయం తమకు తెలియదని సమర్ధించున్న బ్యాంక్.. ఆ తర్వాత జంతువులు కొవ్వు అనవాళ్లు ఉన్నాయని అంగీకరించింది. అయితే పామాయిల్ వాడటం పర్యావరణానికి హానికరమమే ఉద్దేశంతో జంతువుల కొవ్వు వాడటం కొనసాగించాలని నిర్ణయించింది.
అయితే భారత్‌లో కూడా త్వరలో పాలిమర్ నోట్లు రానున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇవ్వడంతో ఆర్బీఐ నోట్లను తీసుకొచ్చే ప్రణాళికలు రచిస్తోంది. ఇతర దేశాల్లో నోట్లపై వివాదాలు రావడంతో భారత్‌లో తయారుచేసే పాలిమర్ నోట్లకు జంతువుల కొవ్వు వాడకూడదని నిబంధన పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పాలిమర్ షీట్ల విషయంలో ఇతర దేశాల్లో వివాదాలు రావడంతో భారత్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. తొలుత రూ.10, రూ.20 పాలిమర్ నోట్లను తీసుకురావాలని ఆర్బీఐ భావిస్తోంది. పాలిమర్ షీట్ల కొనుగోలు కోసం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది. ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్ల కంటే పాలిమర్ నోట్లు అత్యంత మన్నిక కలిగి ఉంటాయి. తేమకు చినిగిపోయే అవకాశం ఉండదు. ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్లను కూడా ఇందులో ప్రవేశపెట్టనున్నారు. దీంతో నకిలీ నోట్ల సృష్టించడానికి కూడా కుదరదని తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో పాలిమర్ నోట్లను విడుదల చేసేందుకు ఆర్బీఐ సిద్దమవుతోంది.