Kaivalya Vohra: వ్యాపార దిగ్గజాలకే వణుకు పుట్టిస్తున్న యువకుడు.. చిన్న వయసులోనే ఉన్నత శిఖరాలు

|

Oct 21, 2024 | 4:00 PM

సాధారణంగా 19 ఏళ్ల వయసులో యువకులు కాలేజీలకు వెళ్లి చదువుకుంటూ ఉంటారు. అప్పుడే బయట ప్రపంచంలో విషయాలను నేర్చుకుంటూ ఉంటారు. తమ స్నేహితులలో కలిసి సినిమాలు, షికార్లకు తిరుగుతూ సరదాగా గడుపుతూ ఉంటారు. కానీ అదే వయసులో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం, కష్టబడి దాన్ని డెవలప్ చేయడం, బడా వ్యాపారవేత్తలకు పోటీగా నిలవడం సాధ్యమేనా. ఈ ప్రశ్నకు కాదు అనే బదులు వస్తుంది. కానీ కైవల్య వోహ్రా మాత్రం దాన్ని నిజం చేసి చూపించాడు.

Kaivalya Vohra: వ్యాపార దిగ్గజాలకే వణుకు పుట్టిస్తున్న యువకుడు.. చిన్న వయసులోనే ఉన్నత శిఖరాలు
Kaivalya Vohra
Follow us on

కైవల్య వోహ్రా స్నేహితుడితో కలసి వ్యాపారాన్ని విజయపథంలో నడిపిస్తున్నాడు. తన వయసున్న వారు గ్రాడ్యుయేషన్ ను పూర్తి  చేయకముందే.. ఆయన మాత్రం పెద్ద వ్యాపారానికి అధిపతి అయ్యాడు. కిరాణా సరుకులు అనేవి ప్రతి కుటుంబానికి అవసరమే. ప్రతినెలా దుకాణాల వద్దకు వెళ్లి వీటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత బిజీ జీవితంలో ప్రత్యేకంగా షాపుల వద్దకు వెళ్లడం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో కిరాణా సరుకులను మన ఇంటికి తెచ్చేందుకు అనేక సంస్థలు వచ్చాయి. ఇలా కిరాణా డెలివరీ వ్యాపారంలో బ్లింకిట్, స్విగ్గీ, ఇన్ స్టామార్ట్, బీబీనౌ యాప్ లు సేవలందిస్తున్నాయి. వాటితో పోటీ పడి వ్యాపారం కొనసాగిస్తున్నదే జెప్టో. దీన్నే కైవల్య వోహ్రా స్థాపించాడు.

డెలివర్ యాప్ స్టార్టప్ లో జెప్టో యాప్ సంచలనంగా మారింది. కేవలం పది నిమిషాల్లోనే ఇంటికి కిరాణా సరుకులు అందజేయడం దీని ప్రత్యేకత. బయటకు వెళ్లనవసరం లేకుండా ఇంటి నుంచే ఆర్డర్ పెడితే చాలు ఇంటికి తీసుకువచ్చి సరుకులు అందజేస్తారు. ఈ వ్యాపారంలో జెప్టో యాప్ ప్రజల మన్ననలు పొందింది. మిగిలిన యాప్ లకు పోటీగా ముందుకు దూసుకుపోతోంది. ముంబై కేంద్రంగా దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో జెప్టో యాప్ సేవలు అందిస్తోంది. లోకేషన్ ను అనుసరించి కేవలం పది నిమిషాల్లో సరుకులు డెలివరీ చేయడం దీని ప్రత్యేకత. ఆ సమయంలో డెలివరీ కాకపోతే సంబంధిత సరుకుల మీద డిస్కౌంట్లు, ఇన్సెంటివ్ లు ఇస్తారు. వాటికి అయ్యే ఖర్చును జెప్టో యాప్ నిర్వాహకులు భరిస్తారు. అలాగే డెలివరీ కోసం ప్రత్యేక చార్జీలు వసూలు చేయరు. కిరాణా సామగ్రి, మందులు, పండ్ల, మాసం తదితర వాటిని జెప్టో అందజేస్తుంది. 

కైవల్య వోహ్రో 2001లో ముంబైలో జన్మించాడు. కంప్యూటర్ ఇంజినీరింగ్ లో తన ప్రయాణం ప్రారంభించాడు. అనంతరం యూఎస్ఏలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో చదువును కొనసాగించాడు. ఆ తర్వాత వ్యాపారం రంగంలో రాణించాలనే ఉద్దేశంతో సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. 19 ఏళ్ల వయసులో తన స్నేహితుడు ఆదిత్ పాలిచాతో కలిసి జెప్టో అనే స్టార్టప్ ను ప్రారంభించాడు. భారతీయ గ్రోసరీ డెలివరీ మార్కెట్ లో తీవ్రమైన పోటీ ఉంది. బడా దిగ్గజాలు ఈ రంగంలో కొనసాగుతున్నాయి. వాటికి పోటీగా జెప్టో రాణిస్తోంది. మెరుగైన సేవలు అందిస్తూ కస్టమర్ల అభిమానం పొందుతోంది. వ్యాపారంలో సాధించిన విజయంతో కైవల్య వోహ్రా 19 ఏళ్ల వయసులోనే ఐఐఎఫ్ఐల్ వైల్త్ – హురున్ ఇండియా రిచ్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. అలాగే ఏటా ఆ జాబితాలో కొనసాగుతున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..