Air India Crash: విమాన ప్రమాదంలో బంగారం, డబ్బు స్వాధీనం.. హక్కుదారులకు ఇవ్వడం సాధ్యమేనా?

జూన్ 12న అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా ఏఐ-171 విమానం కూలిపోయిన తరువాత అధికారులు ఆ శిథిలాల నుంచి అనేక విలువైన, వ్యక్తిగత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు 70 తులాల బంగారు ఆభరణాలు (సుమారు 800 గ్రాములు), రూ. 80,000 నగదు, భగవద్గీత కాపీ, పాస్‌పోర్ట్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న వస్తువులను వాటి నిజమైన హక్కుదారులను ఎలా గుర్తిస్తారనే అనుమానం అందరికీ ఉంటుంది.

Air India Crash: విమాన ప్రమాదంలో బంగారం, డబ్బు స్వాధీనం.. హక్కుదారులకు ఇవ్వడం సాధ్యమేనా?
Ahmedabad Palne Crash

Updated on: Jun 21, 2025 | 2:49 PM

భారతీయ చట్టాల ప్రకారం ప్రమాద స్థలాల నుండి స్వాధీనం చేసుకున్న విలువైన వస్తువుల వివాదాలను అనేక విధాలుగా పరిష్కరించవచ్చు. ప్రస్తుతానికి సరైన హక్కుదారుడిని గుర్తించే వరకు బంగారాన్ని ప్రభుత్వం భద్రపరుస్తుంది. హక్కుదారు ఎవరూ ముందుకు రాకపోతే ఈ విలువైన వస్తువులను ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారు. స్వాధీనం చేసుకున్న బంగారం, నగదు, ఇతర వస్తువులు పోలీసులు లేదా జిల్లా యంత్రాంగం వంటి సంబంధిత ప్రభుత్వ అధికారుల ఆధీనంలో ఉంటాయి. ఈ వస్తువులను ప్రభుత్వ ఖజానాల్లో లేదా లాకర్లలో భద్రపరుస్తారు. గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ జూన్ 15, 2025న, స్వాధీనం చేసుకున్న అన్ని వస్తువులను గుర్తించి, మరణించిన వ్యక్తికి సంబంధించిన దగ్గరి బంధువులకు అప్పగిస్తామని ప్రకటించారు. సరైన హక్కుదారులను గుర్తించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా ఉంటుంది.  వారసులను గుర్తించడంలో డీఎన్ఏ మ్యాచింగ్, ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల డాక్యుమెంటరీ ధ్రువీకరణ ఉంటుంది.

విమానా ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో పాటు విమానం కూలిన బిల్డింగ్‌లో ఉన్న 28 మందికి పైగా మరణించారు. మృతదేహాలను గుర్తించడానికి డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నారు. బంగారం, ఇతర వస్తువుల గుర్తింపును కూడా ఈ ప్రక్రియ ద్వారా నిర్ణయిస్తారు. పాస్‌పోర్ట్‌లు, టిక్కెట్లు లేదా సామగ్రి రసీదులు వంటి ప్రయాణీకుల సామగ్రి వివరాలను, వారి కుటుంబ సభ్యులు అందించిన సమాచారాన్ని ఉపయోగించి వస్తువులను సరిపోలుస్తారు. ఆభరణాల కొనుగోలు రసీదులు వంటి అందుబాటులో ఉన్న ఏవైనా పత్రాలు లేదా ఆధారాలు గుర్తింపు ప్రక్రియను సులభతరం చేస్తాయి.

మరణించిన వ్యక్తి ఆస్తి, బంగారం, నగదుతో సహా, వారి చట్టబద్ధమైన వారసులకు బదిలీ చేస్తారు. ఈ ప్రక్రియ హిందువుల కోసం హిందూ వారసత్వ చట్టం, ముస్లింల కోసం ముస్లిం వ్యక్తిగత చట్టం క్రైస్తవుల కోసం భారతీయ వారసత్వ చట్టం 1925 ద్వారా నిర్వహిస్తారు. అయితే చట్టబద్ధమైన వారసులు ఎవరూ బంగారం లేదా ఇతర వస్తువులను క్లెయిమ్ చేయకపోతే వాటిని క్లెయిమ్ చేయని ఆస్తిగా వర్గీకరిస్తారు. అటువంటి ఆస్తి ఒక నిర్దిష్ట కాలం వరకు సాధారణంగా ఏడు సంవత్సరాలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఈ వ్యవధిలోపు హక్కుదారులు ఎవరూ కనుగొనకపోతే ఆస్తి ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుంది. ప్రయాణికులు తమ లగేజీకి బీమా చేసిన సందర్భాల్లో, గుర్తించిన వారసులు కూడా పరిహారం పొందుతారు. ప్రమాదం జరిగినప్పటి నుండి 162 మంది మరణించిన వ్యక్తులను డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించినట్లు మీడియా నివేదికలు ద్వారా వెల్లడవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి