
రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైల్వే కౌంటర్లలో కొనుగోలు చేసే టికెట్లకు కూడా రూ.10 లక్షల ప్రమాద బీమా సదుపాయం అందించనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 27వ తేదీ నుంచే ఈ సౌకర్యాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పటివరకు ఆన్లైన్లో రైలు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మాత్రమే ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి ఉండేది. కేవలం 45 పైసలు చెల్లిస్తే రూ.10 లక్షల ప్రమాద బీమా దీని ద్వారా ప్రయాణికులకు ఎప్పటినుంచో లభిస్తుంది. దీని వల్ల రైలు ప్రమాదంలో మరణించినా లేదా గాయాలైనా, అంగవైకల్యం పొందినా రూ.10 లక్షల వరకు క్లెయిమ్ లభిస్తుంది. అయితే కౌంటర్లలో కొనుగోలు చేేసే టికెట్లకు ఈ ఇన్సూరెన్స్ సదుపాయం మొన్నటివరకు లేదు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి టికెట్ కొనే లక్షలాది మంది సామాన్య, పేద ప్రయాణికులకు ఈ బీమా సదుపాయం అందుబాటులో లేదు.
ఆన్లైన్ ప్రయాణికులకు ఒకలా, కౌంటర్ టికెట్ దారులకు మరొకలా భద్రత కల్పించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రైలు ప్రయాణికులందరికీ సమాన రక్షణ కల్పించాలని రైల్వేశాఖను ఆదేశించింది. అక్టోబర్ 27 నుంచే కౌంటర్ టికెట్లకు బీమా వర్తింపజేయాలని తుది తీర్పు వెలువరించింది. ఈ ఆదేశాలను అమలు చేయకపోతే పూర్తి బాధ్యత రైల్వే బోర్డు వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు రోజూ కౌంటర్లలో టికెట్లు కొనుగోలు చేసే కోట్లాది మంది సాధారణ, పేద రైలు ప్రయాణికులకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. దీని వల్ల అక్టోబర్ 27 నుంచి కౌంటర్లో టికెట్ తీసుకునే ప్రతి ఒక్కరూ ఈ రూ.10 లక్షల బీమా రక్షణను పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది.
అయితే రైల్వే కౌంటర్ల వద్ద మీరు టికెట్ కొనుగోలు చేసేటప్పుడు ప్రయాణ బీమా కావాలనుకుంటే నగదు రూపంలో చెల్లించకూడదు. కేవలం డిజిటల్ విధానంలో మాత్రమే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. మీకు ప్రయాణ బీమా వద్దనుకుంటే నగదు రూపంలో చెల్లించి టికెట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రయాణ బీమా ప్రీమియం 45 పైసలుగా ఉంది. మీరు నగదు రూపంలో చెల్లించాలంటే చిల్లర చెల్లింపు సమస్య ఉంటుంది. 45 పైసలు నగదు రూపంలో చెల్లించడం కష్టం. దీంతో పూర్తి డిజిటల్ చెల్లింపు విధానం అమలు చేస్తున్నారు. అయితే ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాక మీ మొబైల్, మెయిల్ ఐడీకి ఇన్సూరెన్స్ కంపెనీ వివరాలు అందుతాయి. దాని ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు.