Budget 2022: ఊరిస్తున్న నిర్మలమ్మ బడ్జెట్.. కేంద్ర ఆర్ధిక పద్దుల గురించి ఆసక్తికర అంశాలు మీకోసం!

|

Jan 31, 2022 | 12:00 PM

వచ్చే ఆర్ధిక సంవత్సరం(2022 - 23) కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్ కోసం పార్లమెంట్ సమావేశాలు ఈరోజు (జనవరి 31) ప్రారంభం అయ్యాయి.

Budget 2022: ఊరిస్తున్న నిర్మలమ్మ బడ్జెట్.. కేంద్ర ఆర్ధిక పద్దుల గురించి ఆసక్తికర అంశాలు మీకోసం!
Health Budget
Follow us on

Budget 2022: వచ్చే ఆర్ధిక సంవత్సరం(2022 – 23) కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్(Budget-2022)  కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్ కోసం పార్లమెంట్ సమావేశాలు ఈరోజు (జనవరి 31) ప్రారంభం అయ్యాయి. రేపు అంటే ఫిబ్రవరి 1 వ తేదీన బడ్జెట్ ను దేశ ఆర్ధిక మంత్రి.. నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)ప్రవేశపెట్టనున్నారు. వరుసగా నాలుగోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇది మోడీ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న 10వ బడ్జెట్. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్ వెనుక చాలా ఆసక్తికర విశేషాలు ఉన్నాయి.  వాటిని మీకోసం ఇక్కడ అందిస్తున్నాం.

నో బ్రీఫ్ కేస్..

సంప్రదాయ బ్రీఫ్‌కేస్‌ను నిర్మలా సీతారామన్ పక్కన పెట్టేశారు. గతంలో పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆర్ధిక మంత్రులు బ్రీఫ్ కేస్ తో వచ్చేవారు. ఈ సంప్రదాయానికి 2019లో బారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వస్తి పలికారు. బ్రీఫ్‌కేస్ బదులు భారత సంప్రదాయం ప్రకారం ఎర్ర రంగు గుడ్డలో పెట్టి దారంతో కట్టిన ఫైలును మొదటి సారిగా తీసుకు వచ్చారు నిర్మల. అప్పటినుంచి ప్రతి సంవత్సరం ఇలానే చేస్తూ వస్తున్నారు. దీన్ని బహీ-ఖాతా (పుస్తక ఖాతా) అని పిలుస్తారు. అయితే, ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే.. భారత తొలి ఆర్థిక మంత్రి ఆర్‌కె షణ్ముఖం చెట్టి కూడా తన బడ్జెట్ ప్రసంగాన్ని ఒక తోలు సంచిలో తీసుకొచ్చారు. అది కూడా దాదాపు బ్రీఫ్‌కేసులాగే కనిపించేది. కానీ నిర్మల సీతారామన్ దాన్ని పూర్తిగా మార్చివేశారు

తొలి బడ్జెట్‌ ఎప్పుడు ప్రవేశాపెట్టారంటే..

భారత్ లో తొలి బడ్జెట్‌ను ఏప్రిల్ 7, 1860న ప్రవేశ పెట్టారు. జేమ్స్ విల్సన్, స్కాటిష్ ఆర్థికవేత్త , ఈస్టిండియా కంపెనీలో పని చేసిన నేత భారతదేశ బడ్జెట్‌ను బ్రిటిష్ ఎంప్రెస్ ముందు ఉంచారు.

స్వాతంత్ర్యం వచ్చాక మొదటి బడ్జెట్ ఎప్పుడంటే..

స్వతంత్ర భారతంలో మొదటి బడ్జెట్ 26 నవంబర్ 1947న అప్పటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం చెట్టి ప్రవేశపెట్టారు. ఇది 1947 ఆగస్టు 15వ తేదీ నుంచి 1948 మార్చి 31 వరకు అంటే.. ఏడున్నర నెలలకు మాత్రమే అమలైంది. ఆహార, పారిశ్రామిక ఉత్పత్తి, దిగుమతుల్ని తగ్గించి స్వయం సమృద్ధి సాధించటంపై ఎక్కువగా దృష్టి సారించారు ఈ బడ్జెట్ లో. భవిష్యత్ అవసరాల దృష్ట్యా రక్షణ రంగాన్ని బలోపేతం చేయటం, సమాజంలో శాంతి భద్రతలను నెలకొల్పాలని పిలుపు ఇచ్చారు ఈ బడ్జెట్ లో. అంతేకాకుండా ఈ బడ్జెట్ కు సంబంధించిన కొన్ని వివరాలిలా ఉన్నాయి..

  • ఆహార ధాన్యాల విషయంలో దేశం స్వయం సమృద్ధి
  • సొంత వసరులపై నిలబడాలి.
  • ఆదాయ అంచనా.. రూ.171.15 కోట్లు
  • వ్యయం అంచనా.. రూ.197.39 కోట్లు
  • లోటు.. రూ.26.24 కోట్లు
  • శరణార్థుల పునరావాసం కోసం ఖర్చు
  • కొత్తగా ఏర్పడ్డ పశ్చిమ బెంగాల్, తూర్పు పంజాబ్‌ ప్రావిన్సులకు కూడా కొంత ఆర్థిక సహాయం
  • ప్రతిపాదించిన ఆదాయ అంచనా.. రూ.171.15 కోట్లు
  • కస్టమ్స్ నుంచి రూ.50.5 కోట్లు, ఆదాయపు పన్ను ద్వారా రూ.29.5 కోట్లు, సాధారణ వసూళ్లు రూ.88.5 కోట్లు.
  • పోస్టు, టెలిగ్రాఫ్‌ల శాఖ నుంచి ఆదాయం రూ.15.9 కోట్లు, ఖర్చు, వడ్డీ రూ.13.9 కోట్లు. నికర మిగులు అంచనా రూ.2 కోట్లు.
  • 1949 ఏప్రిల్ 1 నాటికి ఆర్మీలో 2.60 లక్షల మంది సైనికులు ఉండాలి
  • భారతదేశం నుంచి బ్రిటీష్ సేనలు వైదొలుగుతున్నాయి
  • 1947 ఆగస్టు 17వ తేదీన తొలి బృందం తిరిగి వెళ్లింది
  • 1947 లోనే పూర్తి కావాల్సిన ఈ ప్రక్రియ నౌకాయానంలో ఇబ్బందులతో 1948 ఏప్రిల్ వరకు కొనసాగింది

బడ్జెట్ విషయంలో నిర్మలా సీతారామన్ రికార్డ్..

2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంలో ఏకంగా 2 గంటల 42 నిమిషాల పాటు నిర్మల సీతారామన్ మాట్లాడారు. అదేవిధంగా అంతకుముందు జూలై 2019లో కూడా 2 గంటల 17 నిమిషాలునిర్మలా సీతరామన్ సుదీర్ఘంగా ప్రసంగం చేసిన రికార్డు ఉంది.

భారతదేశ చరిత్రలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండో మహిళ సీతారామన్. 1970లో ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఇందిరాగాంధీ

బడ్జెట్ ప్రసంగంలో గరిష్ట రికార్డులు ఇవే..

1991లో మన్మోహన్ సింగ్ బడ్జెట్ ప్రసంగంలో మొత్తం 18,650 పదాలు ఉన్నాయి. ఆ తర్వాత 2018లో 18,604 పదాలతో అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం ఉంది.

అతి తక్కువ సమయంలో బడ్జెట్ ప్రసంగం

1977లో అప్పటి ఆర్థిక మంత్రి హిరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ 800 పదాల బడ్జెట్ ప్రసంగం చేశారు. ఇప్పటివరకూ పార్లమెంట్ లో ఇదే అత్యల్ప బడ్జెట్ ప్రసంగ సమయం

అత్యధిక సార్లు బడ్జెట్‌ను సమర్పించింది

1962 నుంచి వరుసగా అత్యధిక సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది. ఆ తర్వాత పి చిదంబరం (తొమ్మిది), ప్రణబ్ ముఖర్జీ (ఎనిమిది), యశ్వంత్ సిన్హా (ఎనిమిది), మన్మోహన్ సింగ్ (ఆరు) సార్లు బడ్జెట్ ఎక్కువసార్లు ప్రవేశపెట్టారు. ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా మాత్రం నిర్మాలా సీతారామన్ నిలుస్తారు.

బడ్జెట్ ప్రసంగం సమయం

1999 వరకూ ఫిబ్రవరి చివరి రోజు సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ ప్రసంగం ఉండేది. దానిని యశ్వంత్ సిన్హా 1999లో ఉదయం 11 గంటలకు మార్చారు. ఆ తరువాత 2017 ఫిబ్రవరి 1న అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం. అప్పటి నుంచి ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను సమర్పిస్తూ వస్తున్నారు.

హిందీలోను బడ్జెట్‌

1955 వరకు బడ్జెట్‌ను ఇంగ్లీష్ లోనే సమర్పించేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంగ్లం , హిందీ రెండింటిలోనూ సమర్పించడం ప్రారంభించింది.

మొదటి పేపర్‌లెస్ బడ్జెట్

కరోనా కారణంగా 2021-22 సంవత్సరానికి బడ్జెట్ పేపర్‌లెస్‌ గా ప్రవేశపెట్టారు. ఈసారి కూడా అదేవిధానం కొనసాగించబోతున్నారు.

రైల్వే బడ్జెట్‌ సాధారణ బడ్జెట్‌లో విలీనం

2017 వరకు రైల్వే బడ్జెట్ , సాధారణ బడ్జెట్ వేర్వేరుగా సమర్పించేవారు. 2017లో రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేసి ఒకటిగానే ప్రవేశపెట్టారు. అప్పటినుంచి ఒకే బడ్జెట్ గా సాధారణ, రైల్వే బడ్జెట్ లు ప్రవేశపెడుతున్నారు.

బడ్జెట్ ప్రతులు ముద్రణ ఎక్కడ జరుగుతుంది?

1950 వరకు బడ్జెట్ ముద్రణ రాష్ట్రపతి భవన్‌లో జరిగేవి. అక్కడ పత్రాలు లీక్ కావడంతో న్యూఢిల్లీలోని మింటో రోడ్‌లోని ప్రెస్‌లో ముద్రణ ప్రారంభించారు. 1980లో ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ప్రభుత్వ ప్రెస్‌లో ముద్రణ చేశారు.

ఇవి కూడా చదవండి:  Budget 2022: ఈ సారి కూడా పూర్తిగా పేపర్‌లెస్ బడ్జెటే.. ఆ వేడుక రద్దు.. వివరాలివే..

Budget2022: బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆర్ధిక మంత్రి ఉపయోగించే పదాలకు అర్ధాలు తెలుసా?