చైనాలో వూహాన్ (కొరోనా) వైరస్ విజృంభిస్తోంది. దీని బారిన పడి మృతి చెందినవారి సంఖ్య 17 కు పెరగగా.. సుమారు 10 వేల మందికి ఈ వైరస్ లక్షణాలు సోకాయి. ఈ ప్రాణాంతక వైరస్‌కు నాంది పలికినట్టు భావిస్తున్న వూహాన్ పట్టణంలోకి ఎవరూ ఎంటర్ కారాదని, అలాగే ఇక్కడినుంచి ఎవరూ బయటకి వెళ్లరాదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నుంచి చైనాలో చాంద్రమాన నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే గురువారం నుంచే ఈ నిషేధాజ్ఞలను విధించారు. ఈ డెడ్లీ వైరస్‌ని కంట్రోల్ చేయడం సాధ్యం కావడంలేదని అధికారులు దాదాపు చేతులెత్తేశారు. సార్స్ వంటి ఈ వైరస్ వ్యాధి లక్షణాలు థాయ్‌లాండ్, జపాన్, తైవాన్, సౌత్ కొరియా దేశాలతో బాటు అమెరికాలోనూ కన్పిస్తున్నాయి. అమెరికాలో సీటెల్ నగరానికి చెందిన 30 ఏళ్ళ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు తెలియడంతో అతడిని ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 532 మందికి స్కానింగ్ టెస్టులు చేశారని తెలుస్తోంది. కొరోనా వైరస్ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరాకరించింది. అయితే ఈ సంస్థ అధికారులు గురువారం మళ్ళీ సమావేశమై ఇందుకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
వూహాన్ సీఫుడ్ మార్కెట్ నుంచి ఈ వైరస్ మెల్లగా ప్రారంభమైంది. ముఖ్యంగా అడవి జంతువులను చంపి వాటి శరీర భాగాలను ఇతర దేశాలకు అక్రమంగా రవాణా చేసే స్మగ్లర్లు ఉన్న ప్రాంతమిది.. ఇక్కడినుంచి అమెరికాతో బాటు మరో 5 దేశాలకు వీటిని రవాణా చేస్తున్నారు. అమెరికాలోని లాస్‌ఏంజిలిస్ విమానాశ్రయంతో బాటు అయిదు ఎయిర్‌పోర్టుల్లో స్కానింగ్ టెస్టుల కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఇక చైనాలోని ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది ప్రత్యేకమైన సూట్ ధరించి స్పెషల్ వార్డుల్లో రోగులకు చికిత్స అందిస్తున్నారు. ప్రాణాంతకమైన ఈ వైరస్ సోకకుండా సిబ్బంది…. ఒక రోగిని ప్లాస్టిక్ ట్యూబులో ఉంచి ఒక విమానాశ్రయం నుంచి తరలిస్తున్న ఫోటోలను అక్కడి వెబ్ సైట్లు ప్రచురించాయి.