తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ప్రజాదరణ విషయంలో దేశంలోనే తొలి స్థానంలో నిలిచారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనితీరుకు ప్రజలు జై కొట్టినట్లు సీఓటర్-ఐఏఎన్‌ఎస్ తాజా సర్వే తేల్చింది. పనితీరు విషయంలో దేశంలోని ముఖ్యమంత్రులలో అందరి కంటే కేసీఆర్ ముందున్నారు. మొత్తంగా 79.2 శాతం మంది ఆయన పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఈ సర్వే తేల్చింది. కేసీఆర్ తర్వాత స్థానంలో హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఉన్నారు. ఈ సర్వే కోసం తెలంగాణలో 20827 మంది అభిప్రాయాలు సేకరించారు. అందులో 68.3 శాతం మంది కేసీఆర్ పనితీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేయగా.. 20.8 శాతం మంది కొంత వరకు సంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం 9.9 శాతం మంది మాత్రమే ఆయన పనితీరు బాగాలేదని అభిప్రాయపడ్డారు. ఇక ఈ జాబితాలో పుదుచ్చెరి, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు అట్టడుగున నిలిచారు.