వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక చిగురుటాకులా వణుకుతోంది. విదేశీయులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డ విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకూ మొత్తం ఎనిమిది చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. హోటళ్లు, చర్చిల్లో విదేశీ యాత్రికులే టార్గెట్‌గా ఆత్మహుతి దాడులు జరిగాయి. కొలంబోతో సహా నెగొంబో, బట్టికలోవా నగరాల్లో ఆదివారం ఉదయం జరిగిన వరుస పేలుళ్లలో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా, పెద్ద ఎత్తున గాయపడ్డారు. వరుస బాంబు పేలుళ్లలో 35మంది విదేశీయులు చనిపోయారు. ఈ పేలుళ్ల వెనుక ఐసిస్ హస్తముందని శ్రీలంక ప్రభుత్వం భావిస్తోంది.
అయితే ఈ దాడుల్లో 185మంది చనిపోయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినప్పటికీ మృతుల సంఖ్య మరింతగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సుమారు 500మంది గాయపడినట్లు సమాచారం. కాగా ఆరు గంటల వ్యవధిలో ఎనిమిదిచోట్ల పేలుళ్లు జరిగాయి. తాజాగా దెహివాలా జులాజికల్ గార్డెన్‌లోని రిసెప్షన్ హాల్ వద్ద ఎనిమిదో పేలుడు జరగ్గా ఇద్దరు మరణించగా పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు.