శాసన సభలో బల పరీక్షకు తమ ప్రభుత్వం సిధ్ధంగా ఉందని మధ్యప్రదేశ్ సీఎం కమల నాథ్ ప్రకటించారు. మంగళవారానికల్లా సభలో ఫ్లోర్ టెస్ట్ ను ఎదుర్కోవాలని గవర్నర్ లాల్ జీ టాండన్.. కమల్ నాథ్ ను కోరిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ నెల 26 వరకు సభ వాయిదా పడడంతో కమల్ నాథ్ ప్రభుత్వం కాస్త ఊపిరి పీల్చుకుంది. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు.. ప్రభుత్వం తన మెజారిటీని వెంటనే నిరూపించుకోవాలంటూ.. గవర్నర్ ఎదుట పరేడ్ నిర్వహించారు. పైగా సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీంతో గవర్నర్.. ఈ నెల 17 నే కమల్ నాథ్ సభలో బల పరీక్షను ఎదుర్కోవాలని ఆదేశిస్తూ ఆయనకు లేఖ రాశారు. కానీ… ఫ్లోర్ టెస్ట్ విషయంలో కమల్ నాథ్ తనకు లేఖ రాయడాన్ని గవర్నర్ తప్పు పట్టారు. ఇది అర్థరహితమని, రాజ్యాంగ విలువలులకు విరుధ్ధమని ఆరోపించారు. (స్పీకర్ కు గల విచక్షణాధికారాలను మీరు ప్రశిస్తున్నారంటూ కమల్ నాథ్ తన లేఖలో విమర్శించారు). ఇదిలా ఉండగా.. తామెవరి నిర్బంధంలో లేమని బెంగుళూరులో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ఎవరి ఒత్తిడీ తమపై లేదన్నారు. జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతుదారులైన 22 మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాలకు రాజీనామా చేసిన విషయం విదితమే. అటు ఫ్లోర్ టెస్ట్ జరిగేలా చూడాలంటూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది.