కాకరేపుతున్న ముత్తిరెడ్డి కామెంట్స్.. చిచ్చుపెట్టిందెవరు ?

| Edited By: Ravi Kiran

Oct 15, 2019 | 1:17 PM

తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్టీసీ సమ్మె అట్టుడికిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార టిఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన కామెంట్లు మరింత కాకరేపుతున్నాయి. పది రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె వెనుక, కార్మిక సంఘాల మొండి పట్టు వెనుక మావారే (టిఆర్ఎస్ నేతలు) వున్నారంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు కొత్త దుమారానికి దారి తీశాయి. ఇంతకీ ముత్తిరెడ్ది చెబుతున్న ఇంటి దొంగలు ఎవరు అనే అంశంపై పలు గుసగుసలు తీవ్రమయ్యాయి. పది రోజులుగా […]

కాకరేపుతున్న ముత్తిరెడ్డి కామెంట్స్.. చిచ్చుపెట్టిందెవరు ?
Follow us on

తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్టీసీ సమ్మె అట్టుడికిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార టిఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన కామెంట్లు మరింత కాకరేపుతున్నాయి. పది రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె వెనుక, కార్మిక సంఘాల మొండి పట్టు వెనుక మావారే (టిఆర్ఎస్ నేతలు) వున్నారంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు కొత్త దుమారానికి దారి తీశాయి. ఇంతకీ ముత్తిరెడ్ది చెబుతున్న ఇంటి దొంగలు ఎవరు అనే అంశంపై పలు గుసగుసలు తీవ్రమయ్యాయి.

పది రోజులుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె చేయడం కొత్తేమీ కాదు. కానీ ఈసారి అటు కార్మికులు, ఇటు ముఖ్యమంత్రి కెసీఆర్ ఇక చర్చల్లేవ్ ఓన్లీ యాక్షనే అనే స్థాయికి పరిస్థితి వెళ్ళిందంటే మధ్యలో ఎవరో నిప్పు రాజేసి వుంటారని పలువురు భావించారు. అయితే.. దీనికి కారణం టిఆర్ఎస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలనుకుంటున్న ప్రతిపక్ష పార్టీలు, వాటి నేతలే అని అందరూ భావిస్తున్నారు. కార్మిక సంఘాల ఆందోళనలో పాల్గొంటున్న రాజకీయ నాయకులు.. సమ్మె పరిష్కారానికి మార్గాలు చూపకుండా.. ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం.. కార్మిక సంఘాల నేతలను మరింత రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నాయి.

ఈ క్రమంలో ఆర్టీసీ సమ్మె ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య పోరాటంగా మారుతున్నట్లు కనిపించింది. అయితే అనూహ్యంగా ఇపుడు ముత్తిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్త దుమారానికి తెరలేపాయి. అధికార పార్టీ నేతలే ఆర్టీసీ కార్మిక సంఘాలను రెచ్చగొట్టి సమ్మెలోకి దింపాయంటూ ఆయన చేసిన కామెంట్ కాకరేపుతోంది. నిక్కచ్చిగా వ్యవహరించే కెసీఆర్ కు వ్యతిరేకంగా సమ్మె కుంపటి రాజేసే ధైర్యం టిఆర్ఎస్ పార్టీలో ఎవరికుందన్న చర్చ మొదలైంది. సమ్మె చేస్తున్న కార్మిక సంఘాల నేతలు.. ముఖ్యమంత్రిపై ఘాటుఘాటు విమర్శలు చేస్తూనే.. ఒకానొక టిఆర్ఎస్ ముఖ్యనేతను తెగ పొగిడారు. దీని వెనుక మతలబేంటన్నది నాలుగైదు రోజుల క్రితం చర్చ జరిగింది. తాజాగా ముత్తిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు.. కార్మిక సంఘాల నేతలు చేసిన వ్యాఖ్యలకు ఏమైనా లింకు వుందా ? అన్నది కూడా చర్చకొస్తోంది.

కార్మిక సంఘాల మొండి వైఖరికి.. టిఆర్ఎస్ ముఖ్యనేత ఒకరి మద్దతు వుంది అన్న ముత్తిరెడ్డి వ్యాఖ్యల్లో నిజమెంత అనేది కూడా సందేహమే. సమ్మెకు దారి తీసిన పరిస్థితులు అనేకం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని సమయంలో తీవ్రమైన నష్టాల్లో వున్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని డిమాండ్ చేయడం ఆశ్చర్యంగా వుంది. రాష్ట్ర పరిస్థితి కంటే స్వలాభమే ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమైనట్లు కనిపిస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రం చేసింది కాబట్టి ఇక్కడా అలాగే చేయాలనడం అవివేకమేనని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

ఏది ఏమైనా.. ఆర్టీసీ సమ్మె వెనుక వున్న అధికార పార్టీ నేతలెవరన్నది నిగ్గు తేలాల్సి వుంది. అలాగని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వ్యాఖ్యల్ని పూర్తిగా విశ్వసించలేం. ఆయన స్టేట్ మెంట్ వెనుక మతలబేంటన్నది తేలాల్సి వుంది. మొత్తానికి ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన పరిణామాలను ముత్తిరెడ్డి వ్యాఖ్యలు కొత్తదారికి మళ్ళించే సంకేతాలు కనిపిస్తున్నాయి.