తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మోసపూరిత దృక్ఫథానికి క్లియర్ కట్ ఉదాహరణను ఎత్తిచూపారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. నయవంచన రాజకీయాలకు చంద్రబాబు నిలువెత్తు నిదర్శనమని ఆరోపించారు సీఎం జగన్. కడప జిల్లాలో నెలకొల్ప తలపెట్టిన భారీ ఉక్కు కర్మాగారానికి ముఖ్యమంత్రి జగన్ సోమవారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సభలో ప్రసంగించారు. చంద్రబాబు తీరుపై నిప్పులు గక్కారు సీఎం జగన్.
కడప జిల్లావాసుల చిరకాల వాంఛ అయిన స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నించారని జగన్ ఆరోపించారు. అందుకే ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎలాంటి ఒప్పందాలు, అనుమతులు లేకుండా ఉక్కు ఫ్యాక్టరీకి చంద్రబాబు శంకుస్థాపన చేశారని జగన్ చెప్పారు. చంద్రబాబు ప్లాన్ అంతా కడప జిల్లా ప్రజలను మోసం చేసేందుకేనని అన్నారాయన. అదే సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల కాలంలోనే కడప జిల్లాలో భారీ ఉక్కు ఫ్యాక్టరీకి తాను శంకుస్థాపన చేసి, తన కమిట్‌మెంట్‌ని చాటుకున్నానని చెప్పుకున్నారు జగన్.
15 వేల కోట్ల రూపాయల వ్యయంతో మూడేళ్ళ కాలంలో 30 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి. దీని కోసం ఎన్.ఎం.డి.సి.తో ముడి ఉక్కు సరఫరాకు ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నానని చెప్పారాయన. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంలో భాగస్వామి కోసం ప్రయత్నిస్తామని, ఒకవేళ భాగస్వామి దొరక్కపోయినా ఏపీ ప్రభుత్వం సొంత ఖర్చుతోనే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మూడేళ్ళలో పూర్తి చేస్తుందని వెల్లడించారు జగన్. దేశానికి మరో పదేళ్ళలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ఉక్కు అవసరమవుతుందని, అందులో పది శాతం అంటే 30 లక్షల మెట్రిక్ టన్నుల ఉక్కు కడప ఫ్యాక్టరీ ద్వారా ఉత్పత్తి అవుతుందని చెప్పుకొచ్చారు సీఎం జగన్?