వారెవ్వా.. తీర్పంటే ఇదే కదా ? ఆర్టీఐ పరిధిలోకి చీఫ్ జస్టిస్

|

Nov 13, 2019 | 4:14 PM

వరుస తీర్పులతో సంచలనం సృష్టిస్తున్న సుప్రీం కోర్టు బుధవారం మరో సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు వ్యవహారాలు కూడా పారదర్శకంగా వుండాలని తేల్చి చెప్పింది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా వస్తుందని బుధవారం అపెక్స్ కోర్టు తీర్పు చెప్పింది. న్యాయవ్యవస్థ కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందంటూ 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును చీఫ్ జస్టిస్ రంజయ్ గొగోయ్ సారథ్యంలో అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. […]

వారెవ్వా.. తీర్పంటే ఇదే కదా ? ఆర్టీఐ పరిధిలోకి చీఫ్ జస్టిస్
Follow us on

వరుస తీర్పులతో సంచలనం సృష్టిస్తున్న సుప్రీం కోర్టు బుధవారం మరో సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు వ్యవహారాలు కూడా పారదర్శకంగా వుండాలని తేల్చి చెప్పింది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా వస్తుందని బుధవారం అపెక్స్ కోర్టు తీర్పు చెప్పింది.

న్యాయవ్యవస్థ కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందంటూ 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును చీఫ్ జస్టిస్ రంజయ్ గొగోయ్ సారథ్యంలో అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. భారత న్యాయవ్యవస్థలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు కూడా సమాచార హక్కు చట్టం వర్తిస్తుందని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు ధర్మాసనం.

2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును హైలైట్ చేస్తూ..‘‘ చీఫ్ జస్టిస్ కార్యాలయం కూడా ప్రజలకు సంబంధించినదే.. సమాచారం హక్కు చట్టం, ప్రైవసీ చట్టం రెండు నాణేనికి బొమ్మా బొరుసు వంటివి ’’ అని బుధవారం రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. తీర్పును ఏప్రిల్ 4, 2019న రిజర్వు చేసింది.

తాజాగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేస్తున్న తరుణంలో ఈలోగా కీలకమైన కేసులను పరిష్కరించ తలపెట్టారు. అందులో భాగంగా ఏప్రిల్ 4న రిజర్వు చేసిన తీర్పును బుధవారం వెలువరించారు. దీంతో సమాచార చట్టానికి సుప్రీంకోర్టు కూడా అతీతం కాదని చాటింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం.