కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి(77) కన్నుమూశారు. కొద్దిరోజులుగా నిమోనియాతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఈరోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని జూబ్లిహిల్స్‌లోని స్వగృహానికి తరలించారు.
తెలంగాణలోని మహబూబ్‌నగర్‌జిల్లా మాడుగులలో 1942 జనవరి 16న జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జైపాల్ రెడ్డి తల్లిదండ్రులు సూదిని దుర్గారెడ్డి, యశోదమ్మ. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టా పొందారు. కాంగ్రెస్ అత్యవసర పాలనను వ్యతిరేకిస్తూ ఆపార్టీకి రాజీనామా చేసి జనతాపార్టీలో చేరారు. 1985 నుంచి 88 వరకు జనతాపార్టీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1969లో తొలిసారి మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన జైపాల్‌రెడ్డి .. నాలుగు సార్లు అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం అందుకున్నారు.