ప్రపంచ దేశాలన్నింటికి కన్నీరు తెప్పిస్తున్న కరోనా.. పాకిస్థాన్‌కు మాత్రం ఓ శుభవార్తను చెప్పింది. ఈ వైరస్ ప్రభావంతో.. పాకిస్థాన్ అతిపెద్ద గండం నుంచి బయటపడినట్లే అయ్యింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా.. చేపట్టే నిరోధక చర్యలపై ఈ జూన్‌లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే కరోనా ప్రభావంతో ఈ సమావేశం వాయిదా పడినట్లు సమాచారం. దీంతో పాక్ ప్రభుత్వం ఊపిరి తీసుకుంటున్నట్లు ఉంది. ఎందుకంటే.. ఈ సారి జరిగే సమావేశాల్లో పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. జూన్‌లో జరిగే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమావేశాలు చైనాలో జరగాల్సి ఉంది. ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ పాక్ బ్లాక్ లిస్టులో పడిపోయేది. గతంలో చైనా వెననకేసుకు రావడంతో.. గ్రే లిస్టులో పెట్టింది (ఎఫ్‌ఏటీఎఫ్).
ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా గతంలో ఎఫ్‌ఏటీఎఫ్ సూచించిన ప్రణాళికను పాక్ ఏమేరకు అమలు చేసిందన్న దానిపై రివ్యూ చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన సభ్యదేశాలు ఆశించిన పనితీరును పాక్ కనబర్చినట్లు కనిపించకపోతే.. ఇక పాకిస్థాన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశాలు కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడుతుండటంతో.. పాక్‌కు తాత్కాలిక ఊరట లభించినట్లైంది.