అనంతపురం జిల్లా రైతులు ఆగ్రహంతో ఊగిపోయారు. మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండల కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రోడ్డుపై అడ్డంగా ముళ్ల కంపలు వేసి నిరసన తెలిపారు. రాయితీ ప్రత్యామ్నాయ విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించిన రైతులు ధర్నాకు దిగారు. సంబంధిత అధికారులు స్పందించి..తమకు హామీ ఇచ్చేంత వరకు ఇక్కడి నుండి కదిలేది లేదంటూ భీష్మీంచుకుచ్చున్నారు. గత మూడు రోజులుగా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా..అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తిండి తిప్పలు మానేసి విత్తనాల కోసం ఎదురు చూస్తున్న రైతుల గోడు పట్టించుకునే వారే లేరా అంటూ మహిళ రైతులు సైతం మండిపడ్డారు. సాగు సమయంలోనే తమకు విత్తనాలు పంపిణీ చేసి తమను ఆదుకోవాలని వేడుకున్నారు. లేదంటే తమకు ప్రత్యామ్నాయ ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేశారు.