జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 తొలిగించిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌లో ఆర్టికల్ 370 రద్దు బిల్లు ఆమోదం కూడా పొందింది. రాజ్యసభలో అమిత్ షా బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే రాష్ట్రపతి కూడా గెజిట్ విడుదల చేశారు. అయితే అదే సమయంలో ఓ ఎస్సెమ్మెస్ వైరల్ గా మారింది. కశ్మీర్ లో రియల్ ఎస్టేట్.. త్వరపడండి అంటూ వచ్చిన ఓ మెసెజ్ సంచలనం రేపింది.
“బుక్ యువర్ ల్యాండ్ అట్ కశ్మీర్ లాల్ చౌక్ రోడ్..” అన్న ఈ మెసేజ్‌లో భూముల ధరలను కూడా నిర్ధేశించారు. కేవలం రూ.11.25 లక్షలేనని, అది కూడా జీఎస్టీ కలిపి అని ఆ సందేశంలో పెట్టారు. ఆర్టికల్ 370 తొలగించారని.. అందువల్లో ఆస్తులను కొనుక్కోవాలంటూ ఆఫర్ ప్రకటించారు. అంతేకాదు ఓ మొబైల్ నంబర్ కూడా అందులో జోడించారు.
దీంతో అందులో ఉన్న ఫోన్ నంబర్‌కు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమయ్యాయి. అయితే ఆ ఫోన్ నంబర్ కోల్‌కతాకు చెందిన ఈడెన్ రియాలిటీ గ్రూప్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు చెందినది. కాగా తమకు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వచ్చేసరికి.. స్పందించిన ఆ సంస్థ ఆ మెసేజ్‌ను తాము పెట్టలేదని, ఇది ఎవరో కావాలనే చేశారని వివరణ ఇచ్చింది. అంతేకాదు.. ఈ విషయంపై కోల్‌కతా సైబర్ క్రైం సెల్‌కు కూడా ఫిర్యాదు చేశామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. మొత్తానికి ఆర్టికల్ 370 రద్దుతో.. ఇప్పుడు అక్కడ రియల్ వ్యాపారం ప్రారంభమవుతున్న సంకేతాలు వ్యక్తం అవుతున్నాయి.