ఓటు.. ప్రజాస్వామ్యం పౌరుడికి ఇచ్చిన గొప్ప వరంగా అభివర్ణించారు ప్రముఖ హస్యనటులు బ్రహ్మనందం. ఓటు విలువ తెలిసిన వారు నిరక్షరాస్యులకు, అవగాహన లేని వారికి దాని ప్రాముఖ్యతను వివరించాలని ఆయన కోరారు. పోలింగ్ రోజున ఓటు ప్రాముఖ్యత గురించి ‘టీవీ9’ నిర్వహించిన ప్రత్యేక లైవ్ షోలో బ్రహ్మనందం పాల్గొన్నారు. క్యాస్ట్ అనేది ప్రజలు పట్టించుకోకూడదని కోరిన బ్రహ్మనందం…కులాంతర వివాహాలే కాదు.. క్యాస్ట్ లెస్ మ్యారేజెస్ వస్తే బాగుంటుందని ఆకాక్షించారు. ఈ సందర్భంగా సొసైటీలో మార్పు రావాలని కోరారు. సేవా దృక్ఫధం లేకపోతే మనిషికి వాల్యూ ఉండదని అన్నారు. మన ఒక్కరి గురించే కాకుండా పక్కింటి వాళ్లను, మన వీధిలోని వాళ్లను, మన ఊరిలోని వాళ్లను ఓటు వేసే దిశగా ప్రొత్సహించాలని బ్రహ్మనందం కోరారు. మన ఊరు బాగుపడితే దేశం బాగుపడుతుందని ఆయన అన్నారు. ప్రతి ఓటరు విచక్షణతో ఓటు వేయాలని కోరిన బ్రహ్మి..అభ్యర్థి శక్తి , సామర్ధ్యాలను అంచనా వేయాలన్నారు. లీడర్ మంచివాడు అయితే..ఆ నియోజకవర్గం బాగుపడుతుందని చెప్పారు. పర్ఫెక్ట్ అభ్యర్థికి ఓటు వేస్తే..అది సద్వినియోగం అవుతుందని చెప్పారు. తనకు రాజకీయాలంటే ఇష్టం లేదన్న బ్రహ్మనందం..ఇంట్రస్ట్ ఉంటే ఎప్పుడో పాలిటిక్స్‌లోకి వచ్చేవాడినని చెప్పారు.