అభివృద్ధి పనులకు ఎన్నికల కమిషన్ అనుమతి.. ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టు కీలక ఆదేశం.. స్థానిక సంస్థల ఎన్నికల ఆదేశాలపై విచారణ వాయిదా

|

Nov 16, 2020 | 2:18 PM

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్ని సర్కార్ వర్సెస్ ఎన్నికల సంఘం తకరారులో సుప్రీంకోర్టు ఈసీకి అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నెలకొన్న సందిగ్ధ పరిస్థితిలో ఈసీ వాదనవైపే సుప్రీం ధర్మాసనం మొగ్గు చూపింది.

అభివృద్ధి పనులకు ఎన్నికల కమిషన్ అనుమతి.. ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టు కీలక ఆదేశం.. స్థానిక సంస్థల ఎన్నికల ఆదేశాలపై విచారణ వాయిదా
Follow us on

Election commission permission must for developmental programs: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయనందున ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్నికల కమిషన్ అనుమతి అవసరమని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో లేనందున ఈసీ అనుమతి దేనికి అన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. ఎన్నికలను వాయిదా మాత్రమే వేశామని, రద్దు చేయనందున అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి అనివార్యమన్న ఈసీ తరపు న్యాయవాది వాదనకు అనుకూలంగా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

ఏపీలో స్థానిక ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవరించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. అభివృద్ధి పనుల ప్రారంభానికి ఈసీ అనుమతి తీసుకోవాలన్న ఆదేశాన్ని సవరించాలని ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అయితే, ఎన్నికల సంఘం ఏదైనా అభివృద్ధి పనులను ఆపిందా అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.

కొత్తగా ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లో లేదని రోహత్గి ధర్మాసనానికి నివేదించారు. ఎన్నికల కోడ్ అమలులో లేనప్పుడు ఈసీ అనుమతి ఎలా తీసుకుంటామని ఆయన వాదించారు. అయితే, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు చేయలేదని, కేవలం వాయిదా మాత్రమే వేశామని ఈసీ తరపు న్యాయవాది పరమేశ్వర్ తెలిపారు.

దాంతో నిర్దిష్ట అభివృద్ధి పనులకు ఈసీకి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. అనుమతి ఇవ్వకపోతే అప్లికేషన్ దాఖలు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం.

ALSO READ: నడిరోడ్డుపై రివాల్వర్‌తో వీరంగం