ఇస్రో చేబట్టిన మానవ సహిత ‘ గగన్‌యాన్ ‘ మిషన్ లో ఇదో సరికొత్త ఇంటరెస్టింగ్ ‘ ఐటమ్ ‘.. ఈ అంతరిక్షయానం కోసం ఇప్పటికే నలుగురు పైలట్లను వ్యోమగాములుగా ఇస్రో ఎంపిక చేసిందని, రష్యాలో వారు శిక్షణ పొందనున్నారని ఈ సంస్థ చీఫ్ కె. శివన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నలుగురికీ అందించే ఆహారంపై తాజా క్లారిటీ వచ్చింది. వీరికి పప్పు, ఆలూ పరాఠాలు, చికెన్ కర్రీ, పులావ్, ఆల్మండ్స్ సహా సుమారు 22 డిష్ లను సమకూర్చనున్నారు. వచ్ఛే ఏడాది ఆఖరులో.. లేదా..2022 ఆరంభంలో గగన్‌యాన్ ప్రాజెక్టును ఇస్రో చేపట్టనుంది. అయితే ఈ దేశీ ఫుడ్ మెనూ యుఎస్-నాసా నిర్దేశించిన ఆహార ప్రమాణాలకు తగినట్టుగా ఉండాలని అంటున్నారు. ఇవన్నీ కలిపి 60 కేజీల బరువుకు మించరాదని, వంద లీటర్ల నీటిని కూడా సమకూరుస్తారని తెలుస్తోంది.
మైసూరులోని డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లేబొరేటరీ ఈ ఆహారాన్ని అందించనుంది. పాస్తా, పిజ్జాలను పూర్తిగా పక్కన పెట్టేశారు. అంతరిక్షంలో వ్యోమగాములు దాదాపు వారం రోజులు గడపనున్నారు. వీరి అభిరుచికి అనుగుణంగా మెనూ సిద్డం చేస్తున్నారు. ఈ డిష్ శాంపుల్స్‌ని తాము ఇస్రోకు పంపామని, అక్కడ జీరో మైక్రోబ్స్ వంటి వాటికి ఇవి అనుగుణంగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని పరీక్షిస్తారని డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబ్ డైరెక్టర్ అనిల్ దత్ సెమ్వాల్ తెలిపారు. ఇస్రో ఎంపిక చేసిన పైలట్లు మొదట ఈ ఐటమ్స్ రుచి చూస్తారని, స్పైసీ తక్కువగా ఉందని వారు భావిస్తే.. వారి టేస్టుకు తగినట్టుగా మరింత స్పైసీగా ఈ ఆహార పదార్థాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. వీటిని ఉంచే పౌచెస్‌లో మైక్రోబ్స్ వంటివి ప్రవేశించకుండా డిస్పోజ్ చేయగల స్పెషల్ ప్యాకేజీలో వీటిని ప్యాక్ చేస్తారని ఆయన చెప్పారు. ఈ ప్యాకేజీలో న్యూట్రిషన్ బార్స్, పండ్ల రసాల పౌడర్, ఆల్మండ్స్, నట్స్ కూడా ఉంటాయని అనిల్ పేర్కొన్నారు.