COVID-19 కరోనా వాక్సిన్ ప్రయోగాల్లో డ్రాగన్ దూకుడు

కరోనాను ప్రపంచానికి పరిచయం చేసి, పెను బీభత్సానికి కారణమైన చైనా ఇపుడు కరోనా వైరస్ నియంత్రణకు వాక్సిన్ కనుగొనే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. మహమ్మారిని నియంత్రించేందుకు అవసరమైన వాక్సిన్ తయారీలో కీలకమైన ముందడుగు వేశామని చైనా సైంటిస్టులు ప్రకటించారు.

COVID-19 కరోనా వాక్సిన్ ప్రయోగాల్లో డ్రాగన్ దూకుడు
Follow us

|

Updated on: May 08, 2020 | 5:58 PM

కరోనాను ప్రపంచానికి పరిచయం చేసి, పెను బీభత్సానికి కారణమైన చైనా ఇపుడు కరోనా వైరస్ నియంత్రణకు వాక్సిన్ కనుగొనే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. మహమ్మారిని నియంత్రించేందుకు అవసరమైన వాక్సిన్ తయారీలో కీలకమైన ముందడుగు వేశామని చైనా సైంటిస్టులు ప్రకటించారు. కరోనా వైరస్ నియంత్రణకు కనుగొన్న వాక్సిన్‌ను ముందుగా కోతులపై ప్రయోగించామని, ప్రయోగం సక్సెస్ అయ్యిందని చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ముందుగా ఈ వాక్సిన్‌ను కోతులకు ఇచ్చిన చైనా శాస్త్రవేత్తలు మూడు వారాల తర్వాత ఆ కోతుల్లోకి కరోనా వైరస్‌కు ఊతమిచ్చే సార్స్ కోవ్ 2ను వాటిలో ఇంజెక్ట్ చేశామని చెబుతున్నారు.

ముందుగా వాక్సిన్ ఇవ్వడం వల్ల కోతుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి, సార్స్ కోవ్ 2 ఇంజెక్టు చేసిన తర్వాత వాటి శరీరాల్లో యాంటీ బాడీస్ విడుదల అయినట్లు గుర్తించామని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మేరకు ఓ సైన్సు మేగజైన్ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే, ఈ మేగజైన్ ఏ సంస్థ పేరును, ఏ సైంటిస్టు పేరును ప్రస్తావించకపోవడం ఈ వార్త నిజమేనా అన్న అనుమానాలకు తావిస్తోంది. వాక్సినేషన్ చేసిన కోతుల్లో విడుదలైన యాంటీ బాడీస్ కరోనా వైరస్‌తో పాటు సాధారణ వైరస్‌లపై కూడా ఎదురు దాడి చేస్తాయని మేగజైన్ కథనంలో పేర్కొన్నారు.

పికోవాక్‌ (PiCoVacc)  పేరిట బీజింగ్ నగరంలోని సినోవాక్ బయోటెక్ ల్యాబులో రూపొందిన ఈ వ్యాక్సిన్‌ అధిక డోస్‌ను ఇంజెక్ట్ చేసిన కోతుల ఊపరితిత్తుల్లో కరోనా వైరస్‌ లేదని, వ్యాక్సిన్‌ తీసుకోని కోతులు వైరస్‌తో పోరాడలేక తీవ్ర న్యుమోనియోకు గురయైనట్లు గుర్తించామని పరిశోధకులు పేర్కొన్నట్లు మేగజైన్ కథనం చెబుతోంది. ఈ వాక్సిన్ ద్వారా శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్‌ను యాంటీ బాడీస్ ఉత్పత్తి చేసేలా ప్రేరేపిస్తారు. ఈ యాంటీ బాడీస్ కరోనా వైరస్‌ని హతమారుస్తాయని సినోవాక్ బయోటెక్ సైంటిస్టులు చెబుతున్నట్లు ఈ మేగజైన్ కథనంలో వివరించారు. కాగా ఏప్రిల్‌ ద్వితీయార్ధం నుంచే చైనా ఈ వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇటలీ, ఇజ్రాయిల్‌లు ఇప్పటికే కోవిడ్‌-19 టీకాలను అభివృద్ధి చేయడంలో విజయం సాధించామని ప్రకటించాయి. ఇంకో వైపు మన దేశంలో జరుగుతున్న ప్రయోగాలు సైతం సత్ఫలితాస్తున్నట్లు తెలుస్తోంది.