Speaker Pocharam suspends Congress MLAs: తెలంగాణ అసెంబ్లీలో గలాటా సృష్టించిన కాంగ్రెస్ సభ్యులను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ సభ్యులను స్పీకర్ పలుమార్లు వారించినా.. వినకపోవడంతో వారిని ఒకరోజుపాటు సస్పెండ్ చేస్తూ తన నిర్ణయాన్ని వెలువరించారు. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధోరణిపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఎంఐఎం తరపున అక్బరుద్దీన్ ఓవైసీ, బీజేపీ తరపున రాజాసింగ్, కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించారు. ఆ తర్వాత ఈ చర్చకు సమాధానం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలో మరిన్ని అంశాల ప్రస్తావనకు అవకాశం ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలు మార్లు పోడియంలోకి దూసుకు వచ్చారు. ఆయన ధోరణిపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సమాధానం తర్వాత క్లారిఫికేషన్లకు అవకాశం ఇస్తానని స్పీకర్ చెప్పినా వినకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దాంతో అధికార పక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్‌కు తీర్మానం ప్రతిపాదించగా.. స్పీకర్ ఆమోదంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒకరోజుపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.
సస్పెండైన ఎమ్మెల్యేలలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క, జగ్గారెడ్డి, పోడెం వీరయ్య వున్నారు. సస్పెన్షన్ తర్వాత కూడా కాంగ్రెస్ సభ్యుల ఆందోళన కొనసాగింది. దాంతో స్పీకర్.. మార్షల్స్ సహాయంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరుగురు కాంగ్రెస్ సభ్యులను సభనుంచి బయటికి తరలించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. మరోవైపు సస్పెండైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయటి పాదయాత్ర నిర్వహించారు.