‘మాట తప్పేది లేదు-మడమ తిప్పేది లేదు’..నేను విన్నాను-నేను ఉన్నాను’. వైఎస్సార్ ఫ్యామిలీకి పేటెంట్ రైట్స్ ఉన్న డైలాగ్స్. కేవలం ఈ మాటలు చెప్పడమే కాదు..ఆడిన మాటలు తప్పకుండా ఉండటం ఈ ఫ్యామిలీకి అలవాటు. ముక్కుసూటితనం, ఏదైనా అనుకుంటే చేసేవరకు మొక్కవోని దీక్షతో ముందుకు సాగడం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి ఆయన తనయుడు జగన్ వారసత్వంగా పుణికిపుచ్చుకున్న గుణాలు. వైఎస్ఆర్ అంటే ప్రజల్లో అంతులేని ఇమేజ్ ఉంది. ఆయన మాట అంటే తిరుగులేని నమ్మకం. వైద్య, విద్యను నిమ్నవర్గాలకు చేరువ చేసిన సీఎంగా ఆయనకు ఉన్న ఫాలోయింగ్ వర్ణణాతీతం.
ఇప్పుడు జగన్ కూడా తండ్రికి తగ్గ వారసుడిగా పేరు సంపాదించుకోడానికి సీఎంగా అలుపెరగని ప్రయాణం సాగిస్తున్నారు. 9 ఏళ్ల పాటు అనేక ఆటుపోట్లకోర్చి గద్దెనెక్కిన జగన్..పాలనలో తన మార్క్ చూపిస్తున్నాడు. రాష్ట్రంలో లోటు బడ్జెట్‌లో ఉన్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా సాయం లభించుకున్నా సంక్షేమం విషయంలో అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ఎన్నికలముందు హామి ఇచ్చిన నవరత్నాల్లోని ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ ప్రజలు మెచ్చిన సీఎంగా గుర్తింపు తెచ్చుకునేందుకు అహోరాత్రులు శ్రమిస్తున్నారు.
ఇక కొన్ని నిర్ణయాల విషయంలో దేశంలోనే సంచలన సీఎంగా మారారు జగన్. గత ప్రభుత్వం చేసుకున్న పీపీఏ రద్దు వద్దని కేంద్రం, విద్యత్ అప్పిలేట్ ట్రిబ్యునల్ పలుసార్లు రిక్వెస్ట్ చేసునప్పటికి ఏపీ ప్రభుత్వం మాత్రం వెనకడుగు వెయ్యలేదు. ఇక రివర్స్ టెండరింగ్‌కి వెళ్లి గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు. మరోవైపు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రతిపాదనలు చేసి దేశంలోనే సంచలనాలకు తెరలేపారు. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పక్కనే తోడున్న ప్రతి నాయకుడికి పదవులు కట్టబెట్టారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ను పాలించడమంటే కత్తిమీద సామే. ప్రజావేదిక కూల్చివేత, ఇసుక కొరత విషయంలో ప్రతిపక్షాల విమర్శలు ఆమోధ్యకరంగానే ఉన్నా…జగన్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మాత్రం పెద్దగా కనిపించడం లేదు. జగన్ రూలింగ్ చూసి రాజన్న బాటలోనే జగనన్న ప్రయాణిస్తున్నాడంటూ మురిసిపోతున్నారు వైఎస్ కుటుంబ అభిమానులు.