జులై నెలలో హైడ్రామాకు తెరలేపి.. కర్నాటకలో ప్రభుత్వం మారడానికి కారకులైన కాంగ్రెస్-జెడిఎస్ రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ముంబయిలో క్యాంపు నడిపి.. దాదాపు నెల రోజుల పాటు కర్నాటకాన్ని కొనసాగించిన 17 మంది ఎమ్మెల్యేలపై చివరి అస్త్రంగా స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే.. అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు నేరుగా సుప్రీం తలుపు తట్టారు. దాదాపు రెండున్నర నెలల విచారణ తర్వాత సుప్రీం కోర్టు బుధవారం నాడు తీర్పు వెలువరించింది.
స్పీకర్ అనర్హత వేటు వేయడాన్ని సమర్థించిన సుప్రీం కోర్టు.. వారిని 2023 సంవత్సరం వరకు పోటీ రాదని నిర్దేశించడాన్ని తప్పు పట్టింది. అనర్హత వేటు వేయడం శాసనసభ స్పీకర్ అధికారమే అయినప్పటికీ వారిని నిర్దేశిత కాలం పాటు పోటీకి దూరం పెట్టడమన్నది స్పీకర్ పరిధిలో లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో నేరుగా సుప్రీం కోర్టును అప్రోచ్ అయిన ఎమ్మెల్యేలకు ముందుగా హైకోర్టుకు వెళ్ళాలని సూచించింది.
సుప్రీంకోర్టు తాజా ఆదేశాల ప్రకారం 17 మందిపై అనర్హత వేటు కన్‌ఫర్మ్ కాగా.. ప్రస్తుతం జరగనున్న కర్నాటకలో ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని సుప్రీం కోర్టు కల్పించినట్లు అయ్యింది. 2018లో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే. ఫలితాలొకవైపు వెలువడుతుండగానే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి పట్టుమని 30 ఎమ్మెల్యేలు లేని జెడిఎస్ పార్టీకి సీఎం సీటును ఆఫర్ చేసింది. ప్రభుత్వంలో చేరి డిప్యూటీ సీఎం పోస్టుతోపాటు స్పీకర్ పదవిని తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. అయితే.. అతిపెద్ద పార్టీగా గెలిచినా అధికారం దక్కకపోవడంతో బిజెపి తొలి నుంచి గుర్రుగానే వ్యవహరించింది.
నిర్ణీత సంఖ్యలో జెడిఎస్-కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చడం ద్వారా అధికారంలోకి వచ్చేందుకు బిజెపి ఎత్తుగడలు వేసింది. అయితే.. దాని ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడకూడదని భావించిన బిజెపి అధిష్టానం జులై వరకు వేచి చూసేలా రాష్ట్ర నాయకత్వాన్ని ముఖ్యంగా యడియూరప్పను ఒప్పించింది. అనుకున్నట్లుగానే సార్వత్రిక ఎన్నికలు ముగియగానే కన్నడ బిజెపి నేతలు కాంగ్రెస్-జెడిఎస్ ఎమ్మెల్యేలను ఉసిగొలిపి, ముంబయి క్యాంపులోకి తరలించారు. దాదాపు నెల రోజుల హై డ్రామా తర్వాత కర్నాటకలో అధికారం బదలాయింపు తంతు పూర్తి అయ్యింది. అయితే పదవి నుంచి దిగిపోయే ముందు ఆనాటి కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్.. 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి, 2013 దాకా పోటీ చేయకుండా ఆదేశాలు జారీ చేశారు.
స్పీకర్ ఆదేశాలపై వెంటనే సుప్రీంకోర్టు మెట్లెక్కారు అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు. అయితే.. తాజాగా అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. దాంతో అనర్హతకు గురైన ఎమ్మెల్యేల పిటిషన్‌పై తక్షణం తీర్పును వెలువరించాల్సి వచ్చింది. బుధవారం తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు.. అనర్హత వేటును ఖరారు చేయడంతోపాటు వారిపై పోటీ చేయకూడదన్న నిబంధనను తొలగించింది. అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్‌దే అయినా.. వేటు పడిన వారిని మళ్ళీ పోటీ చేయకుండా నిర్దేశించే అధికారం స్పీకర్‌కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలకు దక్కింది.