తెలంగాణలో స్థానిక సంస్థల MLC ఎన్నికల ఫలితాలపై ఎవరికి వారు పోస్ట్‌మార్టం చేసుకుంటున్నారు. బలాబలాలపై అంచనా వేసుకుంటున్నారు. సవాల్ విసిరి మరీ పార్టీ ఓట్లు నిలబెట్టుకున్నారు సంగారెడ్డి MLA జగ్గారెడ్డి. క్రాస్ ఓటింగ్ టెన్షన్ అధిగమించి 6 సీట్లు గెలుచుకున్నా ఖమ్మంలో తగ్గిన ఓట్లు అధికారపార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ బరిలో దిగిన పార్టీల్లో కొన్ని పరువు నిలబెట్టుకుంటే.. పరోక్షంగా రంగంలో దిగి స్వతంత్రులను గెలిపించాలని భావించి విఫలమయ్యాయి ఇతర పార్టీలు.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఊహించినట్టుగానే అధికార TRSకు అనుకూలంగా వచ్చాయి. 6 చోట్ల ఏకగ్రీవం కాగా.. పోలింగ్ జరిగిన 6 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ ఒక్క సీటూ సాధించలేదు కానీ పోటీచేసిన రెండు చోట్లా బలాన్ని కాపాడుకుంది. బీజేపీ బరిలో లేకపోయినా కరీంనగర్‌లో రవీందర్‌సింగ్‌కు మద్దతిచ్చి గెలిపించేందుకు చేసిన ప్రయత్నం పెద్దగా సక్సెస్ కాలేదు.
క్రాస్ ఓటింగ్‌పైనే ప్రస్తుతం పార్టీల్లో పోస్టమార్టం జరుగుతోంది. అధికారపార్టీ పవర్ పాలిటిక్స్ ప్లే చేసినా స్వల్ప తేడాతో ఓడినట్టు చెబుతున్నారు రవీందర్ సింగ్. అయితే తమ పార్టీ ఓట్లు ఎక్కడా చీలిపోలేదని.. తమకే పడ్డాయంటున్నారు మంత్రి గంగుల కమలాకర్.
అటు ఆదిలాబాద్, ఇటు నల్గొండలో TRS సునాయాసంగా విజయం నమోదు చేసుకున్నా.. ఖమ్మంలో క్రాస్ ఓటింగ్ TRSలో అంతర్గతపోరును బయటపెట్టింది. పార్టీలో ప్రక్షాళన అవసరమంటూ MLA సండ్ర చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
మెదక్‌లో తన సతీమణి నిర్మలారెడ్డిని బరిలో దింపిన MLA జగ్గారెడ్డి 230కు ఒక్కటి తక్కువ వచ్చినా రాజీనామా చేస్తానని ప్రకటించి 8 ఓట్లు అదనంగా సంపాదించి సత్తా చాటారు. అటు ఖమ్మంలో కాంగ్రెస్‌కు 96 ఓట్లుంటే ఏకంగా 242 ఓట్లు రావడంతో ఫుల్ జోష్ కనిపిస్తోంది. అయితే నల్గొండలో తనకు Bఫాం ఇవ్వకుండా పార్టీలో పెద్దలే నష్టం చేశారంటూ సీనియర్లపై నల్గొండ అభ్యర్ధి నగేష్ ఆరోపించారు. కరీంనగర్ సహా మిగిలిన చోట్ల ఎందుకు పోటీచేయలేదంటూ గాంధీభవన్‌లో ముసలం కూడా మొదలైంది.
మొత్తానికి పోటీచేసిన రెండు చోట్లా సత్తా చాటి మిగిలిన నియోజకవర్గాల్లో పోటీ చేయకపోవడంపై కాంగ్రెస్‌పెద్దలు అంతర్మథనంలో పడితే.. కరీంనగర్‌లో రహస్యంగా మద్దతు ప్రకటించినా సాధించింది ఏమీ లేదని బీజేపీలో చర్చ జరుగుతోంది. అధికారపార్టీకి ఫలితాలు అనుకూలంగా ఉన్నా లోకల్ నాయకత్వాలపై అసంతృప్తి బయటపడిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.