Lucky Zodiac 2023: కొత్త సంవత్సరంలో నాలుగు ప్రధాన గ్రహాలు రాశులు మారబోతున్నాయి. జనవరి 18న శని, ఏప్రిల్ 23న గురువు, అక్టోబరు 24న రాహు కేతువులు రాశులు మారుతున్నాయి. దీని ప్రభావం వల్ల అనేక రాశుల జీవితాలు మలుపులు తిరగబోతున్నాయి. కొత్త సంవత్సరం ఈ 12 రాశులకు రకరకాలుగా అదృష్టాన్ని, కష్ట నష్టాలను తెచ్చి పెట్టడం జరుగుతుంది. కాగా, ప్రధానంగా మూడు రాశుల వారికి మంచి అదృష్ట యోగం పట్టబోతోంది. వ్యక్తిగత జాతకాలలో దశలు అంతర్దశలు బాగున్న పక్షంలో ఈ ఫలితాలు 100% వర్తిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం మేరకు మిధునం, తుల, మకర రాశుల వారికి కొత్త సంవత్సరం పట్టిందల్లా బంగారం కాబోతోంది. ఈ మూడు రాశుల వారు చేయవలసిందల్లా చిన్నపాటి ప్రయత్నం మాత్రమే.
గ్రహ సంచారంలో గురువు, శని, రాహు కేతువుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇతర గ్రహాల ప్రభావం కూడా ఉంటుంది కానీ ఒక్కొక్క రాశిలో ఏడాదికిపైగా ఉండే ఈ నాలుగు గ్రహాల ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. పైన పేర్కొన్న నాలుగు గ్రహాలు ప్రస్తుతం చాలా బలంగా ఉన్నాయి. వచ్చే ఏడాది పూర్తిగా గురు శని గ్రహాలు బాగా ప్రభావితం చేసే విధంగా సంచారం చేస్తున్నాయి. ఇవి మిధున, తుల, మకర రాశి వారి జీవితాలను సానుకూల మలుపులు తిప్పే అవకాశం ఉంది. ఈ సానుకూల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది దశ అంతర్ దశల మీద కూడా ఆధారపడి ఉంటుంది.
స్థూలంగా చెప్పాలంటే ఉద్యోగ, ఆర్థిక వ్యక్తిగత జీవితాల్లో బాగా మార్పులు చోటుచేసుకుంటాయి. మంచి ఉద్యోగ సంస్థల నుంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. వివాహ ప్రయత్నాలు సానుకూల పడతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతానం కోసం తపించిపోతున్న వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. కోరుకున్న ప్రాంతానికి బదిలీ ఉంటుంది. అనారోగ్యాల నుంచి కోలుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు విజయాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ముందడుగు వేస్తాయి. కోర్టు కేసుల్లో నెగ్గుతారు. విదేశీయానం సాధ్యపడుతుంది. ఆస్తి కలిసి వస్తుంది. ఇందులో అన్ని కానీ, కొన్ని కానీ తప్పకుండా జరుగుతాయి.
ఈ మూడు రాశుల వారికి ఇవి చాలా వరకు జరిగే అవకాశం ఉంది. మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తిగా వెళ్లిపోనప్పటికీ, శని కుంభంలో ప్రవేశించడం యోగదాయకమే అవుతుంది. అయితే మకరంతో పోలిస్తే మిథునం వారికి బాగా అదృష్ట యోగం పట్టే అవకాశం ఉంది. ఒక్కొక్క రాశిలో మూడు నక్షత్రాలు ఉండటం జరుగుతుంది. ఈ రాశులలోని మూడు నక్షత్రాలకు యోగం పట్టబోతోంది. ఈ అదృష్ట యోగం 2025 వరకు కొనసాగే అవకాశం ఉంది. కాగా ఈ మూడు రాశులకు అదృష్ట యోగం పడుతున్నప్పటికీ కొద్దిగా శ్రమ తిప్పట కూడా ఉంటాయి. నమ్మినవారు మోసం చేసే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ ఈ రాశుల వారు సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంతా మంచే జరుగుతుంది.
ఈ మూడు రాశుల వారికి అదృష్టం పట్టబోతోందంటే ఇతర రాశులకి ఏమీ జరగదని, అంతా నష్టమే జరుగుతుంది అని అర్థం కాదు. మేష రాశి వారికి, సింహ రాశి వారికి, ధను రాశి వారికి కూడా ఆర్థికంగా, ఉద్యోగ పరంగా మంచి జరిగే అవకాశం ఉంది. విదేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు విజయాలు సాధిస్తారు. వ్యాపారులు, స్వయం ఉపాధి వారు, వృత్తి నిపుణులు ఘన విజయాలు సాధిస్తారు. పెళ్లి కాని వారికి పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. ఇక మీన రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం కాబోతోంది. వృశ్చిక రాశి వారు కర్కాటక రాశి వారు కన్యా రాశి వారు తమ ఇష్ట దైవాన్ని మరింత శ్రద్ధగా భక్తిగా ప్రార్థిస్తే కొన్ని చిక్కుల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి