Moon Horoscope
ప్రస్తుతం వృశ్చిక రాశిలో నీచ స్థితిలో ఉన్న చంద్రుడు ఈ నెల 13వ తేదీ వరకు బలహీనంగానే ఉండే అవకాశం ఉంది. నీచ స్థితి తర్వాత అమావాస్య ఏర్పడడం, ఆ తర్వాత కూడా మకర, కుంభాల్లో సంచారం చేయడం వల్ల చంద్రుడిపరంగా జరగాల్సిన పనులు, వ్యవహారాలకు ఆటం కాలు ఏర్పడడం, ప్రయాణాలు లాభించకపోవడం, ప్రతి ప్రయత్నమూ ఇబ్బంది పెట్టడం వంటివి జరిగే అవకాశం ఉంది. అందువల్ల వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారు కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది.
- వృషభం: ఈ రాశికి సప్తమంలో చంద్రుడు నీచబడడం, ఆ తర్వాత అష్టమ స్థానంలో అమావాస్య ఏర్పడడం వంటి కారణాల వల్ల ఈ రాశివారు కొత్తగా ఎటువంటి ప్రయత్నమూ చేయకపోవడం మంచిది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం. శుభకార్యాల గురించి ఆలోచించకపోవడం మంచిది. ఆస్తి వివాదాల జోలికిపోవద్దు. హామీలు ఉండడం, వాగ్దానాలు చేయడం వంటి వాటికి ప్రస్తుతానికి దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
- కర్కాటకం: ఈ రాశినాథుడైన చంద్రుడు ప్రస్తుతం అన్ని విధాలు గానూ బలహీనంగా ఉన్నందువల్ల ఆహార, విహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. యథాతథ స్థితిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. కొత్త ప్రయత్నాల వల్ల, వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేయడం వల్ల ఆశించిన ఫలితాలు దక్కకపోవచ్చు. కొందరు బంధుమిత్రుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థిక ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడడం గానీ, అవి తప్పనిసరిగా వాయిదా వేయడం గానీ జరుగుతుంది.
- సింహం: ఈ రాశివారికి చంద్రుడి ప్రతికూలత, బలహీనతల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అనారోగ్యాలు ఏవైనా ఉంటే అవి ప్రకోపించే అవకాశం ఉంది. నేత్ర సంబంధమైన సమస్యలకు అవకాశం ఉంది. ఎటువంటి ఒప్పందాల పైనా సంతకాలు చేయకపోవడం మంచిది. ప్రయాణాల్లో విలు వైన వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ఇతరుల విషయాల్లో లేదా వివాదాల్లో తలదూర్చ వద్దు. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు.
- వృశ్చికం: ఈ రాశిలో నీచబడిన చంద్రుడు ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. బంధుమిత్రుల ఆరోగ్యం విషయంలో కూడా ఆందోళన చెందడం జరుగుతుంది. ఆస్తుల విలువ తగ్గడం, అనవసర ఖర్చుల కారణంగా బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గడం వంటివి జరుగుతాయి. కొందరు మిత్రులు మోసం చేయడం గానీ, ఆర్థికంగా నష్టపరచడం గానీ జరిగే అవకాశం ఉంది. తల్లితండ్రు లతో అకారణ విభేదాలు తలెత్తవచ్చు. పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా పడవచ్చు.
- మకరం: ఈ రాశి వారు రహస్య శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. నమ్మినవారు ద్రోహం తలపెట్టే అవకాశం ఉంది. ప్రయాణాల్లో కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎటువంటి ఒప్పందాలనూ కుదర్చుకోవద్దు. ఇల్లుకొనే ప్రయత్నాలను కొంత కాలం వాయిదా వేసుకోవడం మంచిది. జీవిత భాగస్వామికి స్వల్ప అనారోగ్యం తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో అపార్థాలకు, చికాకులకు అవకాశం ఉంది. అనుకున్నదొకటి, అయిందొకటి అన్నట్టుగా ఉంటుంది.
- కుంభం: ఈ రాశివారు చంద్రుడి ప్రతికూలత కారణంగా ప్రస్తుతానికి ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. డబ్బు ఇచ్చినా, తీసుకున్నా నష్టపోవడం, ఇబ్బందుల్లో చిక్కుకోవడం జరుగు తుంది. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయవద్దు. చట్టపరమైన, న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయి. సోదరులతో గానీ, తల్లి తరఫు బంధువులతో కానీ విభేదాలు తలెత్తవచ్చు. ఆహార, విహారాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొత్తవారితో పరిచయాలు పెట్టుకోవద్దు.