
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు..
ఆదాయం-2, వ్యయం-11 | రాజపూజ్యం-4, అవమానం-7
భాగ్య స్థానంలో శనీశ్వరుడు, జూన్ మొదటి వారం నుంచి ఇదే రాశిలో గురువు సంచారం చేయడం వల్ల కర్కాటక రాశి వారికి కొత్త సంవత్సరంలో అనుకూలతలు బాగా పెరుగుతాయి. సమస్యలు, ఒత్తిళ్లు, ఇబ్బందులు బాగా తగ్గే అవకాశం ఉంది.
ఆర్థిక వ్యవహారాలుః కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుంటారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు. ఎవరికీ హామీలు ఇవ్వకపోవడం, వాగ్దానాలు చేయకపోవడం మంచిది.
వృత్తి, ఉద్యోగాలుః వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. జూన్ తర్వాత నుంచి వీరికి ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
కుటుంబ వ్యవహారాలుః ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువులకు సంబంధించి సంతృప్తికరమైన సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం చాలావరకు పరవాలేదు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నా లకు సంబంధించి సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్యలు క్రమంగా పరిష్కారమవుతాయి.