
రాశినాథుడైన గురువు జూన్ మొదటి వారం వరకు సప్తమ స్థానంలో అనుకూలంగా ఉండి ధనుస్సు రాశి వారికి కొండంత అండగా ఉంటాడు. అర్ధాష్టమ శని ప్రభావం కూడా బాగా తగ్గి ఉంటుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. సంవత్సరం ద్వితీయార్థంలో పరిస్థితులు కొద్దిగా మారవచ్చు. అర్ధాష్టమ శని ప్రభావం తగ్గి ఉంటుంది కానీ, ఆదాయం, ఉద్యోగం, వృత్తి, వ్యాపారాల్లో అనుకూలతలు కొద్దిగా తగ్గుతాయి. జూన్ తర్వాత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు ఇబ్బంది పెడతాయి. అయితే, ఏడాదంతా తృతీయ స్థానంలో రాహువు బాగా అనుకూ లంగా ఉన్నందువల్ల కొద్దిగా ఆలస్యంగానైనా సమస్యలు, వివాదాలు పరిష్కారం అవుతాయి. ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల విషయంలో ఈ ఏడాదంతా ప్రశాంతంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. మనసు లోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభ సమాచారం అందుతుంది. జూన్ నుంచి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా సానుకూలతలు కనిపించడంతో పాటు, శుభవార్తలు కూడా వింటారు. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందే అవకాశం ఉంది. ఉద్యోగులకు అధికారయోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది. ప్రముఖులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. సహాయ కార్యక్రమాల్లో, దైవ కార్యాల్లో పాల్గొంటారు.
సంవత్సరం ప్రథమార్థంలో ప్రేమ జీవితం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సుఖ సంతోషాలతో సాగిపోతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమలు, పెళ్లిళ్ల విషయంలో ద్వితీయార్థం కంటే ప్రథమార్థం బాగా అనుకూలంగా ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ జీవితం కూడా నిత్య కల్యాణం పచ్చతోరణంగా సాగిపోతుంది. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు.
ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా సాగిపోతుంది. సౌకర్యాలను మెరుగు పరచుకోవడం మీదా, శుభ కార్యాలు నిర్వహించడం మీదా, సొంత ఇంటిని అమర్చుకోవడం మీదా దృష్టి పెడతారు. ఫిబ్రవరి, మే నెలల మధ్య మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. విదేశీయానానికి అవకాశం కలుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు లభిస్తాయి. మొత్తం మీద ఈ సంవత్సరమంతా చాలావరకు సానుకూలంగా గడిచిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఈ రాశివారికి ఫిబ్రవరి నుంచి జూలై వరకు ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది. ఆ తర్వాత అక్టోబర్, నవంబర్ నెలలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఆ నెలల్లో ముఖ్యమైన ప్రణాళికలను రూపొందించుకోవడం మంచిది. విదేశీ ప్రయాణాలకు సమయం మే, జూలైల మధ్య అనుకూలంగా ఉంది. కొత్త వ్యాపారాలు జూలై నుంచి లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. వివాహాది శుభ కార్యాలకు మే నుంచి జూలై వరకు అనుకూల పరిస్థితులుంటాయి. ఈ నెలల్లో కుటుంబంలో సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి.