
Gajakesari Yoga
ఈ నెల (నవంబర్) 10, 11, 12 తేదీల్లో కర్కాటక రాశిలో గురు చంద్రుల యుతి జరుగుతోంది. గురు చంద్రులు ఒకే రాశిలో కలవడాన్ని గజకేసరి యోగం అంటారు. ఈ యోగం పట్టినవారు ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టగలుగుతారని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. కర్కాటక రాశిలో గురువు ఉచ్ఛపట్టి ఉన్నం దువల్ల ఈ గజకేసరి యోగానికి మరింత విశేషం కలిగింది. ఈ యోగం వల్ల కొందరి జీవితాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ మూడు రోజుల్లో ఏ ప్రయత్నం చేపట్టినా సమీప భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ఈ యోగం వల్ల ప్రస్తుతం మేషం, మిథునం, కర్కా టకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశులవారికి రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి.
- మేషం: ఈ రాశికి చతుర్థన స్థానంలో గజకేసరి యోగం ఏర్పడడం వల్ల రాజయోగాలు, ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా, సంతృప్తికరంగా అభివృద్ధి చెందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. శుభ కార్యాలు జరుగుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
- మిథునం: ఈ రాశికి ధన స్థానంలో గురు, చంద్రులు కలవడం వల్ల, ఇందులో గురువు ఉచ్ఛపట్టడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. మంచి కుటుంబంతో పెళ్లి ఖాయం అవుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి.
- కర్కాటకం: చంద్రుడికి స్వస్థానమైన ఈ రాశిలో రాశ్యధిపతి చంద్రుడు ఉచ్ఛ గురువుతో కలవడం వల్ల తప్ప కుండా రాజయోగాలు, రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. లాభ దాయక సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఊహించని విజయాలు సాధిస్తారు. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. విదేశీ ఆఫర్లు అందుతాయి.
- కన్య: ఈ రాశికి లాభ స్థానంలో గురు, చంద్రుల యుతి జరుగుతున్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులకు, జీత భత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి చెందుతారు.
- వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానంలో గజకేసరి యోగం ఏర్పడడం అనేక విధాలైన అదృష్టాలు కలుగుతాయి. అధికార యోగంతో పాటు మహా భాగ్య యోగం కూడా కలుగుతుంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లపై పైచేయి సాధిస్తారు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. అనారోగ్య, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.
- మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో గురు, చంద్రుల యుతి జరుగుతున్నందువల్ల సమాజంలో ఒక ప్రము ఖుడుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఉన్నత వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ తాయి. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపా రాలు కొత్త పుంతలు తొక్కుతాయి. మీ సలహాలు, సూచనలకు విలువ ఉంటుంది. ఉన్నత కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.
- మీనం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న రాశ్యధిపతి గురువుతో చంద్రుడు కలవడం వల్ల విశేషమైన గజకేసరి యోగం కలిగింది. వీరికి రాజయోగాలు, రాజపూజ్యాలు కలుగుతాయి. ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందుతారు. కొద్ది ప్రయత్నంతో సగటు వ్యక్తి సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అపారంగా లాభిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆపర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి.