అరె.! ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్ అని అంటారు. ఈ వార్త చదివితే.! ఇంతకీ మనోడు చేసిన ఘనకార్యం ఏంటని అనుకుంటున్నారా.. సినిమా స్టైల్ స్కెచ్ వేసి.. మారువేషంలో లేడీస్ హాస్టల్‌లోకి చొరబడ్డాడు. ఇంత తెలివిగా లోపలికి వెళ్లిన అతడు.. చివరికి అడ్డంగా బుక్కై.. పోలీస్ స్టేషన్‌లో ఊసలు లెక్కపెడుతున్నాడు. ఇంతకీ ఖాకీలకు దొరికిపోయిన ఆ యువకుడు ఏం చెప్పాడో తెలిస్తే షాక్ కావడం ఖాయం.! ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకోగా.. ఆ స్టోరీ ఇలా ఉంది.
వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని త్రిసూర్‌కు చెందిన యువతీయువకులు కాలేజీ డేస్ నుంచి ప్రేమించుకుంటున్నారు. ఆ తర్వాత యువకుడు బెంగళూరులో కుకింగ్ పనులు చేస్తూ ఉపాధి సాగిస్తుండగా.. యువతి చిత్తూరులోని గుడిపల్లిలోని కాలేజీలో నర్సింగ్ సెకండియర్ చదువుతోంది. ఆమె అక్కడే కాలేజీ హాస్టల్‌లోనే ఉంటోంది. మనోడికి ప్రియురాలిని చూడాలనిపించిందో.. ఏమో.. వెంటనే బెంగళూరు నుంచి కుప్పం చేరుకున్నాడు. ఎలాగైనా గర్ల్‌ఫ్రెండ్‌ను కలవాలనుకున్న అతడు.. యువతిని హాస్టల్‌లోనే కలుసుకునేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇలా అనుకున్నదే తడువుగా ప్రియురాలి ఉంటున్న హాస్టల్‌కు మారువేషంలో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. సినిమా స్టైల్‌లో బురఖా ధరించి అచ్చం అమ్మాయిలా వేషం వేసుకుని హాస్టల్‌లోకి ఎంటర్ అయ్యాడు. అయితేనేం మనోడి కదలికలు హాస్టల్ సిబ్బందికి అనుమానం కలిగించాయి. వెంటనే అప్రమత్తమై చెక్ చేయగా.. సదరు యువకుడు అడ్డంగా సెక్యూరిటీకి దొరికిపోయాడు. అనంతరం కాలేజీ సిబ్బంది అతడ్ని పట్టుకుని ఓ గదిలో బంధించారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.
ఇక లేడీస్ హాస్టల్‌లోకి ఎందుకు వెళ్లావని పోలీసులు ప్రశ్నించగా.. తన ప్రియురాలిని కలిసేందుకు వచ్చానని చెప్పడంతో దెబ్బకు వారంతా అవాక్ అయ్యారు. కాగా, కాలేజీ వైస్ ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనపై మరో వాదన వినిపిస్తోంది. ప్రియురాలే అతడ్ని పిలిచిందని.. ఆమెతో కలిసి మారువేషంలో హాస్టల్‌లోకి వెళ్తుండగా.. ఆటో డ్రైవర్స్ గమనించి హాస్టల్ వార్డెన్‌కు చెప్పడంతో.. అతడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు ఆ విద్యార్థినిని కూడా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
ఇది చదవండి: ఏపీలో మందుబాబులకు ఎగిరి గంతేసే వార్త.. ఇది కదా కావాల్సింది
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..