Andhra Pradesh: పతకాల వేటలో తెలుగు తేజం.. ఏషియన్ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌‌కు పరుగుల చిరుత

దేశంలో అత్యంత వేగవంతమైన అథ్లెట్‌గా గుర్తింపుపొందిన ఎర్రాజీ జ్యోతి.. మరో ప్రతిష్టాత్మక టోర్నీకి ఎంపికయ్యారు. ఈనెల 27 నుంచి సౌత్‌ కొరియాలో జరగబోయే ఏషియన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీలో భారత జట్టుకు జ్యోతి ప్రాతినిధ్యం వహించనుంది.

Andhra Pradesh: పతకాల వేటలో తెలుగు తేజం.. ఏషియన్ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌‌కు పరుగుల చిరుత
Yarraji Jyothi

Edited By: Surya Kala

Updated on: May 10, 2025 | 8:12 PM

విశాఖ కు చెందిన ఎర్రాజీ జ్యోతి అంతర్జాతీయ అథ్లెట్‌.. ఒలింపియన్‌. భారత్‌ నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి మహిళా హర్డలర్‌గా ప్రత్యేకత చాటుకున్నారు. ఏషియన్‌ గేమ్స్‌లో రజతం, ఏషియన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం తో పాటు అనేక మెడల్స్ కైవసం చేసుకున్నారు జ్యోతి. వరల్డ్‌ యూనివర్సిటీ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో 100 మీటర్ల హర్డిల్స్‌లో అనేక సార్లు పతకాలు సాధించారు. 12.79 సెకండ్లలో వంద మీటర్ల లక్ష్యాన్ని చేదించి తన రికార్డును తనే తిరగరాసారు.

అత్యంత వేగవంతమైన స్పింటర్‌గా గుర్తింపు పొందడమే కాకుండా ఒలింపిక్స్‌ 100 మీటర్ల హర్డిల్స్‌లో పాల్గొన్న తొలి భారత అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పిన ఎర్రాజీ జ్యోతికి.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డుతో గౌరవించింది.

తాజాగా మరోసారి ఏషియన్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీకి ఎంపికవడంతో జ్యోతిని.. జిల్లా కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గణబాబు, వీఎంఆర్డీఏ కమిషనర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌, శాప్‌ చైర్మన్‌ రవినాయుడు, ఒలింపిక్‌ సంఘం ప్రతినిధులు, అథ్లెటిక్స్‌ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. దేశానికి కొన్ని పథకాలు అందించాలని ఆకాంక్షించారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.,.